ఐపీఎల్ 2026 లీగ్ దశ చివరి వారానికి చేరుకున్న వేళ, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక సానుకూలమైన అంచనాను పంచుకున్నారు.
చెన్నైలోని చేపాక్ మైదానంలో జరగబోయే సీఎస్‌కే చివరి హోమ్ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ బరిలోకి దిగే అవకాశం ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డారు.
ధోనీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఫిట్‌నెస్ సమస్యల కారణంగా అతను మ్యాచ్ ఆడతాడా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు తెలిసి ఎంఎస్ ధోనీ ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా ఆడతాడు. ఒకవేళ అతని మోకాలి గాయం లేదా ఫిట్‌నెస్ పూర్తిగా సహకరించకపోతే.. అతను కనీసం 'ఇంపాక్ట్ ప్లేయర్' జాబితాలో అయినా ఉండే అవకాశం ఉంది. చేపాక్ మైదానంలో తన అభిమానుల ముందు అతను మైదానంలోకి దిగకుండా ఉంటాడని నేను అనుకోను అని అశ్విన్ పేర్కొన్నారు.
ఈ రాత్రి చెన్నైలో జరగబోయే మ్యాచ్‌తో ధోనీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ప్రచారం జోరందుకోవడంతో ఈ మ్యాచ్ ప్రాధాన్యత సంతరించుకుంది. గవాస్కర్ వంటి మాజీ క్రికెటర్లు ధోనీ ఫిట్‌నెస్ రీత్యా రిస్క్ తీసుకోకపోవచ్చని అంటుండగా, అశ్విన్ మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను ఉపయోగించుకుని అయినా ధోనీ బ్యాటింగ్‌కు వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్లేఆఫ్స్ రేసు పరంగా కూడా సీఎస్‌కేకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కావడంతో, ధోనీ మైదానంలో ఉండటం జట్టుకు మానసికంగా పెద్ద బూస్టింగ్ ఇస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.
