హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దోమల నియంత్రణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.
సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చెరువులు, నీటి నిల్వ ప్రాంతాల్లో దోమలు పెరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు.
మేము ఐదు విధానాల్లో దోమలు, వాటి గుడ్లను నాశనం చేసే కార్యక్రమాలు చేపట్టేవాళ్లం. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రజలను పూర్తిగా గాలికి వదిలేసింది అని విమర్శించారు.
దోమల బెడద కారణంగా నగరంలో ప్రజలు…మలేరియా,చికెన్ గున్యా వంటి వ్యాధులతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రజా ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదంగా మారుతోందని హెచ్చరించారు.
ప్రస్తుతం పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే దోమల నివారణ చర్యలు చేపట్టాలని సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలో శుభ్రత, నీటి నిల్వల నియంత్రణ, ఫాగింగ్ వంటి చర్యలను పునరుద్ధరించాలని సూచించారు.

