Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎంపీ వేమిరెడ్డికి అనిల్ కుమార్ సవాల్!

ఎంపీ వేమిరెడ్డికి అనిల్ కుమార్ సవాల్!

నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వ హయాంలో భారీగా మైనింగ్ అక్రమాలు, వసూళ్లు జరుగుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు.

మైనింగ్ యజమానులను బెదిరించి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారం సిట్టింగ్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలోనే సాగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. దమ్ముంటే ఈ అక్రమాలపై సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ ఎంపీకి ఆయన సవాల్ విసిరారు.

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మైనింగ్ పర్మిట్ల ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.55 కోట్ల ఆదాయం వచ్చిందని గుర్తుచేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ఆదాయం రూ.7 కోట్లకు, రూ.12 కోట్లకు పడిపోయిందని ఆరోపించారు. గూడూరు నియోజకవర్గంలో మైనింగ్ యజమానులను భయపెట్టి టన్నుకు రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని విమర్శించారు.

ఎగుమతులు చేయాలంటే కూటమి ఎంపీ అనుచరులకు తప్పనిసరిగా మామూళ్లు చెల్లించాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. ఒక్కో మైనింగ్ యజమాని నుంచి రూ.10 కోట్ల చొప్పున వసూలు చేసి దాదాపు రూ.200 కోట్లు కూడబెట్టారని ఆరోపించారు. 'ఫినీ క్వార్ట్జ్' అనే కంపెనీ పేరుతో ఎంపీ అనుచరుడు విజయ్ కుమార్ రెడ్డి ఈ దందాను నడిపిస్తున్నారని పేర్కొన్నారు. చైనాకు చెందిన 'డౌ' అనే వ్యక్తిని రాష్ట్రానికి తీసుకొచ్చి, ఆయనకే మైనింగ్ ఉత్పత్తులు ఎగుమతి చేయాలని ఆదేశాలు ఇస్తున్నారని తెలిపారు. దేశ భద్రతకే ఇది ముప్పుగా మారిందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.

ఎదురు తిరిగిన మైనింగ్ సంస్థలపై డీఎంజీ శాఖ ద్వారా కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. గనులు మూతపడటంతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సైదాపురం మండలంలోని సిద్ధేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ భూముల్లోనూ అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. దేవాదాయ శాఖ మంత్రి విచారణకు ఆదేశించినా దాన్ని అడ్డుకునే శక్తి ఒక్క వేమిరెడ్డికే ఉందని విమర్శించారు. తన ఆరోపణలు అవాస్తవమని నిరూపిస్తే క్షమాపణ చెప్పడానికి తాను సిద్ధమని, ధైర్యం ఉంటే సీబీఐ విచారణకు అంగీకరించాలని అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu