Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎస్వీ యూనివర్సిటీ..నకిలీ చలాన్ల స్కామ్!

ఎస్వీ యూనివర్సిటీ..నకిలీ చలాన్ల స్కామ్!

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నకిలీ చలాన్ల స్కామ్ తీవ్ర కలకలం రేపుతోంది. యూనివర్సిటీ ఉన్నతాధికారుల నకిలీ సంతకాలు, రబ్బర్ స్టాంపులను ఉపయోగించి కొందరు ఉద్యోగులు ఫీజుల రూపంలో పెద్ద ఎత్తున నిధుల దోపిడీకి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది.

విశ్వవిద్యాలయం రెక్టర్ అప్పారావు ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రాథమిక తనిఖీల్లో భాగంగా కేవలం నిన్న ఒక్కరోజే ఏకంగా 27 నకిలీ చలాన్లను గుర్తించారు. వీటి ద్వారా రూ. 65,686 ల ఆర్థిక అవకతవకలు జరిగినట్లు యూనివర్సిటీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, ఇది కేవలం ఒక్క రోజుకు సంబంధించిన వ్యవహారం మాత్రమేనని, ఈ స్కామ్ వెనుక చాలా కాలంగా పెద్ద నెట్‌వర్క్ నడుస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి దాదాపు 5,335 అప్లికేషన్లను సమగ్రంగా విచారించాల్సి ఉందని అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి దర్యాప్తు జరిగితే స్కామ్ విలువ లక్షల్లో ఉండే అవకాశం ఉంది.

ఈ నకిలీ చలాన్ల వ్యవహారంలో యూనివర్సిటీ అంతర్గత సిబ్బంది హస్తం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఫీజు కౌంటర్‌లో పనిచేస్తున్న చిరంజీవి నాయక్ అలాగే జియాలజీ విభాగంలో అకాడమిక్ కన్సల్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శంకర్ అనే ఇద్దరు ఉద్యోగులకు ఈ స్కామ్‌తో ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు విశ్వవిద్యాలయ అంతర్గత విచారణలో తేలింది. విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేసి, నకిలీ స్టాంపులు, సంతకాలతో కూడిన చలాన్లను సృష్టించి ఆ సొమ్మును సొంతానికి వాడుకున్నట్లు తెలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu