Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

'హే రామ్! ఆంధ్రప్రదేశ్‌ను రక్షించండి..'

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆలయాల కూల్చివేతలు కొనసాగుతున్నాయని ఆయన మండిపడ్డారు.

ఈ మేరకు 'హే రామ్! ఆలయాలను రక్షించండి.. ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి' అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలో శతాబ్దాల నాటి అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూల్చివేశారని జగన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం బుల్డోజర్లతో ఈ ఆలయాన్ని నేలమట్టం చేసిందని ఆరోపించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలపై ప్రభుత్వం దాడి చేస్తోందని ఆయన విమర్శించారు.

తిరుమలలో చారిత్రక వెయ్యికాళ్ల మండపం కూల్చివేతతో ఈ విధ్వంసం మొదలైందని జగన్ గుర్తుచేశారు. కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో నాల్గు దశాబ్దాల చరిత్ర ఉన్న ఆలయాలను కూల్చేశారని పేర్కొన్నారు. బద్వేల్‌లోని కాశినాయన జ్యోతి క్షేత్రంలోనూ సత్రాలను తొలగించారని ఆయన ఆరోపించారు. పవిత్ర ఆలయాలపై బుల్డోజర్లు నడపడమేనా పాలన అంటే అని ప్రశ్నించారు.

దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం గతంలో తమ ప్రభుత్వం శ్రీవాణి ట్రస్టును ఏర్పాటు చేసిందని జగన్ తెలిపారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం చారిత్రక ఆలయాలను ఒక్కొక్కటిగా కూల్చివేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని చెబుతున్న చంద్రబాబు దీనికి ఏమని సమాధానం చెబుతారని నిలదీశారు.

ఆలయాలను కాపాడే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో హిందూ ధర్మానికి రక్షణ లేకుండా పోతోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను ప్రజలందరూ గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలు ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu