ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇన్సూరెన్సు డబ్బుల కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను దారుణంగా కొట్టి హతమార్చాడు ఓ భర్త. తర్వాత తానే ఉరివేసుకొని చనిపోయినట్లు చిత్రీకరించారు.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోల్ తండాలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తే తన భార్యని హత్య చేసినట్లు ఆరోపించారు బంధువులు.
ఇంటిపై 80 లక్షలు లోన్ ఉంది, ఆమె పేరు మీద కోటి రూపాయల ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం భార్యని చిత్రవద చేసి, చివరకు హత్య చేశాడు భర్త.
గతంలో భార్యను కింద పడేసి పిడిగుద్దులతో హింసించిన దృశ్యాలు చూపించి.. భర్త శాడిజాన్ని చూపెట్టారు బంధువులు.
14 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని ఇద్దరు బాబులతో తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు స్టేజి దగ్గరలోని గోల్ తండాలో కాపురం ఏర్పాటు చేసుకున్నారు మీనాక్షి, శివాజీ దంపతులు. ఈరోజు ఆమెను హత్య చేసి ఉరేసుకున్నట్టుగా చిత్రీకరించి పరారయ్యాడు నిందితుడు. ఇన్సూరెన్స్ డబ్బు కోసమే ఈ హత్య జరిగిందా..? శివాజీ మనసులో మరి ఏదైనా దురుద్దేశం ఉందా అనే కోణంలో విచారణ జరపాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
