Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

జగన్‌ను కలిసిన మామిళ్ళపల్లి రైతులు

గుంటూరు జిల్లా మామిళ్ళపల్లి గ్రామంలో టీడీపీ శ్రేణులు సృష్టించిన విధ్వంసంపై బాధిత రైతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

తాడేపల్లిలోని జగన్ నివాసంలో జరిగిన ఈ భేటీలో…గ్రామంలో జరిగిన అరాచకాలను రైతులు కళ్ళకు కట్టినట్లు వివరించారు.

రైతులు తాము పండించిన పంటను భద్రపరుచుకున్న గోడౌన్‌పై టీడీపీ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారని జగన్‌కు ఫిర్యాదు చేశారు. దాదాపు 500 మంది టీడీపీ గూండాలు రాడ్లతో వచ్చి గోడౌన్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారని రైతులు తెలిపారు. తమ ఆస్తిని కాపాడుకునేందుకు ప్రయత్నించిన రైతులపై అమానుషంగా దాడి చేశారని, తీవ్రంగా గాయపరిచారని వారు వివరించారు.

ఈ విధ్వంసం అంతా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రోద్బలంతోనే జరిగిందని రైతులు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. జరిగిన ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను జగన్‌కు చూపిన రైతులు, గ్రామంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, అధికార పార్టీ ఒత్తిడితో వారు మౌనంగా ఉంటున్నారని రైతులు పేర్కొన్నారు.

రైతుల విన్నపాన్ని సావధానంగా విన్న వైఎస్ జగన్, బాధితులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. "రాష్ట్రంలో సామాన్య ప్రజలపై, రైతులపై జరుగుతున్న ఇలాంటి దాడులను సహించబోం. చట్టపరంగా బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది" అని ఆయన స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu