మాతృత్వానికి మించిన గొప్ప శక్తి లేదని మరోసారి నిరూపితమైంది. బిహార్‌లోని సమష్టిపూర్ జిల్లాలో తన ఇద్దరు బిడ్డలను కాపాడుకోవడం కోసం ఒక తల్లి రైలు కింద పడి కూడా వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది.
సమష్టిపూర్ జిల్లాలోని షాపూర్ పటోరి రైల్వే స్టేషన్ వద్ద ఒక మహిళ తన ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి పట్టాలు దాటే ప్రయత్నం చేసింది. అయితే, అదే సమయంలో అత్యంత వేగంతో ఒక రైలు ఆ ట్రాక్ మీదికి దూసుకువచ్చింది. తప్పించుకునే సమయం లేకపోవడంతో ఆ తల్లి సమయస్ఫూర్తితో వ్యవహరించింది.
రైలు వేగంగా వస్తుండటాన్ని గమనించిన ఆమె, ప్లాట్‌ఫామ్‌కు మరియు రైల్వే ట్రాక్‌కు మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో తన ఇద్దరు పిల్లలను గట్టిగా హత్తుకుని పడుకుంది. రైలు మొత్తం వెళ్ళిపోయే వరకు ఆమె కదలకుండా పిల్లలను తన శరీరంతో కప్పి ఉంచి వారిని కాపాడింది. ఆమె సాహసాన్ని చూసి స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. రైలు వెళ్ళిపోయిన తర్వాత ఆమె తన పిల్లలతో సహా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనపై స్థానిక ప్రయాణికులు రైల్వే అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్‌లో ఒక ప్లాట్‌ఫామ్ నుండి మరో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు కనీసం ఓవర్ బ్రిడ్జి లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతున్నాయని వారు మండిపడుతున్నారు.ప్రాణాలకు తెగించి బిడ్డలను కాపాడుకున్న ఆ తల్లి ధైర్యసాహసాలను చూసి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
