ఏపీ సీఎం చంద్రబాబు అధికారుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీకి పలువురు కీలక అధికారులు హాజరుకాకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై చర్చించే సమయంలో అధికారుల నిర్లక్ష్యం తగదని ఆయన హెచ్చరించారు.
కేబినెట్ సమావేశంలో భాగంగా ఇంధన పొదుపు అంశంపై ప్రత్యేక చర్చ ఉంటుందని ముందే నిర్ణయించారు. దీనికి సంబంధించి కీలక అధికారులు హాజరు కావాల్సి ఉండగా, వారు భేటీకి రాకపోవడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ముఖ్యమైన చర్చ ఉందని తెలిసినా అధికారులు ఎందుకు రాలేదు? వారికి కనీసం సమాచారం కూడా అందలేదా? అంటూ ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్‌ను సీఎం నిలదీశారు.
దీనిపై స్పందించిన విజయానంద్.. అధికారులందరికీ ముందే సమాచారం అందించానని ముఖ్యమంత్రికి వివరించారు. సమాచారం ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించి, సమయానికి భేటీకి రాని అధికారుల జాబితాను సిద్ధం చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.
ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించే క్రమంలో అధికారుల సమయపాలన, అంకితభావం చాలా ముఖ్యమని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కేబినెట్ వంటి కీలక సమావేశాలకు గైర్హాజరు కావడం అధికారుల బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తుందని, ఇకపై ఇలాంటివి పునరావృతం కాకూడదని ఆయన గట్టిగా హెచ్చరించారు.
