రక్షణ కల్పించాల్సిన రక్షకుడే భక్షకుడిగా మారాడు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఓ వివాహితను లోబరుచుకుని, పెళ్లి పేరుతో మోసం చేసిన ఖమ్మం సీసీఎస్ (CCS) సీఐ బానోత్ రాజు నాయక్ బండారం బయటపడింది.
బాధితురాలిని గర్భవతిని చేసి..ఆపై బలవంతంగా అబార్షన్ చేయించిన ఉదంతంపై ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
2023లో ఓ వివాహిత తన వ్యక్తిగత సమస్యపై ఫిర్యాదు చేయడానికి ఖమ్మం సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న సీఐ బానోత్ రాజు నాయక్ ఆమెపై కన్నేశాడు. ఆమె నిస్సహాయతను ఆసరాగా చేసుకుని, తానే పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఆ నమ్మకంతోనే సదరు మహిళతో సీఐ రాజు నాయక్ సహజీవనం ప్రారంభించాడు.
ఈ క్రమంలో బాధితురాలు గర్భవతి అయింది. విషయం తెలుసుకున్న మహిళ తనను వెంటనే పెళ్లి చేసుకోవాలని సీఐపై ఒత్తిడి తెచ్చింది. అయితే, అప్పటికే బురిడీ కొట్టించిన సీఐ రాజు నాయక్ అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. పెళ్లికి నిరాకరించడమే కాకుండా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెకు బలవంతంగా అబార్షన్ టాబ్లెట్లు ఇచ్చి గర్భాన్ని తీసివేయించాడు.
బాధితురాలికి సంబంధించిన భార్యాభర్తల కేసు ఒకటి అప్పటికే కోర్టు విచారణలో ఉంది. అయినప్పటికీ, సీఐ రాజు నాయక్ తన పరిధిని దాటి ప్రవర్తించాడు. బాధితురాలి భర్తకు పదే పదే ఫోన్లు చేస్తూ నీ భార్యకు వెంటనే విడాకులు ఇవ్వాలి అంటూ తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడు. సీఐ వేధింపులు మితిమీరడంతో ఇక తట్టుకోలేని బాధితురాలు ఉన్నతాధికారులను ఆశ్రయించి తనపై జరిగిన అన్యాయాన్ని వివరించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఖమ్మం టూ టౌన్ పోలీసులు సీఐ బానోత్ రాజు నాయక్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
శాంతిభద్రతలను కాపాడాల్సిన ఉన్నతాధికారే ఇటువంటి హేయమైన చర్యకు పాల్పడటంపై పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన ఉన్నతాధికారులు.. సీఐ రాజు నాయక్‌పై ప్రాథమిక చర్యలు తీసుకున్నారు. అతడిని ఐజీ (IG) ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగేలా పూర్తిస్థాయి విచారణ జరుపుతామని అధికారులు స్పష్టం చేశారు.
