Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొండా సుస్మిత ఘూటు వ్యాఖ్యలు.. చర్యలు తప్పవన్న పీసీసీ చీఫ్!

కొండా సుస్మిత ఘూటు వ్యాఖ్యలు.. చర్యలు తప్పవన్న పీసీసీ చీఫ్!

పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కఠిన చర్యలు తప్పవని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ స్పష్టం చేశారు. గురువారం నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

చిన్నారెడ్డి, కొండా సుస్మిత వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కొండా సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మంత్రి కొండా సురేఖ ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని చెప్పారు. కుమార్తె వ్యాఖ్యలపై ఆమె వివరణ కోరామని, నిన్ననే షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని తెలిపారు. క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చాక తదుపరి చర్యలపై ఆలోచిస్తామన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఆవేదనను అర్థం చేసుకున్నామని తెలిపారు. ఎవరికి టికెట్ ఇవ్వాలనేది ఎన్నికల కమిటీ, సీడబ్ల్యూసీ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ఎవరికి వారు ఇష్టానుసారంగా పోటీ చేస్తామని ప్రకటించడం సరికాదన్నారు.

కాంగ్రెస్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న సొంత పార్టీ నేతల తీరును ఏఐసీసీ తీవ్రంగా పరిగణించింది. పార్టీని బద్నాం చేసేలా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాజాగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలపై డీఏసీ బుధవారం షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఆదిలాబాద్‌ ఇన్‌ఛార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్ సంజయ్‌లకు సైతం నోటీసులు ఇచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎల్బీనగర్‌ నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. కులాల పేరుతో దూషించిన ఘటనలపై ఆధారాలుండడంతో ఆయనపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ తెలిపింది.

వచ్చే ఎన్నికల్లో తాను పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయమని కొండా సుస్మితా పటేల్ స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగిన తల్లి సురేఖ జన్మదిన వేడుకల్లో ఆమె మాట్లాడారు. పరకాల సభలో రేవూరి ప్రకాశ్‌రెడ్డిని గెలిపించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఏకపక్షంగా మాట్లాడటాన్ని ప్రశ్నించారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డికి అవకాశం ఇస్తామంటూ పరకాలలో మరోలా మాట్లాడటం తమను ఇబ్బంది పెట్టడమేనన్నారు. కొండా మురళి కాంగ్రెస్‌లో కింగ్‌ మేకర్‌గా ఎదిగారని తెలిపారు. రేవూరి గెలుపునకు మురళి ప్రచారమే కారణమని గుర్తుచేశారు. పరకాల మా రాజకీయ అడ్డా అని, కాంగ్రెస్‌ టికెట్‌ అడుగుతామని, ఇవ్వకున్నా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటామని తేల్చిచెప్పారు.

ఈ సభలో సుస్మిత సీఎం రేవంత్‌రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. వేం నరేందర్‌రెడ్డి సలహాలు ఏంటో చెప్పాలని నిలదీశారు. సీఎం సోదరుడి డొల్ల కంపెనీకి రూ.200 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారని ఆరోపించారు. తాను ఎవరికీ భయపడనని, కౌంటర్‌ ఇప్పిస్తే సీఎం కుటుంబం అవినీతిని బయటపెడతానన్నారు. తెదేపా నుంచి వచ్చిన వారిపై చూపించే ప్రేమ, నిజమైన కాంగ్రెస్‌ వారిపై చూపడం లేదన్నారు. రేవూరిని రాజీనామా చేయించి మళ్లీ పోటీ చేయించాలని సవాల్ విసిరారు. సీఎం, పొంగులేటికి బీసీలంటే పడదని, తమను తొక్కేస్తున్నారంటూ సుస్మిత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu