Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

కోరిక తీరిస్తేనే ఇందిరమ్మ ఇల్లు?

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నేత దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ అధికార పార్టీ నాయకుడి వేధింపులు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.

ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలంటే తన కోరిక తీర్చాలంటూ ఓ స్థానిక కాంగ్రెస్ నాయకుడు బాధితురాలిని వేధించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రానికి చెందిన ఓ నిరుపేద మహిళ నివాసముంటున్న ఇల్లు ఇటీవల కూలిపోయింది. ఉండటానికి నీడ లేక ఇబ్బంది పడుతున్న సదరు మహిళ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం కింద తనకు ఇల్లు మంజూరు చేయించాలని కోరుతూ స్థానిక కాంగ్రెస్ నాయకుడిని ఆశ్రయించింది.

బాధితురాలి నిస్సహాయతను ఆసరాగా చేసుకున్న ఆ నాయకుడు.. తనకు లొంగిపోవాలని, తన కోరిక తీరిస్తేనే ఇల్లు ఇప్పిస్తానని స్పష్టం చేస్తూ తీవ్రంగా వేధించడం ప్రారంభించాడు. దానికి ఆ మహిళ నిరాకరించడంతో, గతంలో ప్రభుత్వం విడుదల చేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో ఉన్న ఆమె పేరును సదరు నాయకుడు తన రాజకీయ పలుకుబడితో కావాలనే తొలగించాడని బాధితురాలు ఆరోపించింది.

రాజకీయ నాయకుడి వేధింపులు భరించలేక, ఇల్లు రాకుండా అన్యాయానికి గురైన బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది. సదరు కాంగ్రెస్ నాయకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా బాధితురాలు కన్నీరుమున్నీరవుతూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. నిలువ నీడ లేక, అండగా నిలవాల్సిన నాయకుడే ఇలా వేధింపులకు గురిచేయడంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యానని పేర్కొంది. తనకు గనుక పోలీసులు మరియు ప్రభుత్వం న్యాయం చేయకపోతే, తనకు ఆత్మహత్యే శరణ్యమని బాధితురాలు హెచ్చరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu