తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూ తయారీలో కీలకమైన నెయ్యి నిల్వ సామర్థ్యాన్ని భారీగా పెంచుతూ అడుగులు వేస్తోంది.
ఇందులో భాగంగా నెయ్యి నిల్వ సామర్థ్యాన్ని గతంలో ఉన్న 82 వేల కిలోల నుంచి ఏకంగా 2.26 లక్షల కిలోలకు పెంచింది.
నెయ్యి నిల్వను పెంచేందుకు దాతల సహకారంతో అదనంగా 4 భారీ ట్యాంకర్లను టీటీడీ ఏర్పాటు చేసింది. దీనితో ప్రస్తుతం తిరుమలలో మొత్తం 16 నెయ్యి ట్యాంకర్లు అందుబాటులోకి వచ్చాయి.ఈ భారీ నిల్వ సామర్థ్యం వల్ల టీటీడీకి ఒక ముఖ్యమైన సాంకేతిక వెసులుబాటు కలిగింది:
ప్రస్తుతం ఉన్న సామర్థ్యం ప్రకారం సుమారు 15-16 రోజులకు సరిపడా నెయ్యిని ముందస్తుగా నిల్వ చేసుకోవచ్చు.ఒకవేళ సరఫరా అయిన నెయ్యి నాణ్యత తక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో తేలితే, ఆ నిల్వలను వెనక్కి పంపించి కొత్త నిల్వలు తెప్పించుకునేందుకు తగిన సమయం లభిస్తుంది. దీనివల్ల లడ్డూ తయారీకి ఎప్పుడూ నాణ్యమైన నెయ్యి మాత్రమే వాడటం సాధ్యమవుతుంది.
తిరుమల పొటులో ప్రతిరోజూ నెయ్యి వినియోగం భారీ స్థాయిలో ఉంటుంది.రోజుకు సగటున 4 నుండి 4.5 లక్షల లడ్డూలు తయారవుతాయి. పర్వదినాలు, బ్రహ్మోత్సవాల సమయంలో అదనంగా మరో 3 నుండి 4 లక్షల లడ్డూలను ఉత్పత్తి చేస్తారు. లడ్డూల తయారీ కోసం ప్రతిరోజూ సుమారు 16 వేల కిలోల నెయ్యిని వినియోగిస్తున్నారు.
భక్తుల రద్దీ నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో, నెయ్యి నిల్వ సామర్థ్యాన్ని మరో లక్ష కిలోల వరకు పెంచాలని టీటీడీ భావిస్తోంది. తద్వారా రాబోయే కాలంలో లడ్డూ ప్రసాదం కొరత లేకుండా, పూర్తి నాణ్యతతో అందించవచ్చని అధికారులు వెల్లడించారు.
