రాష్ట్రంలో జనాభా పెంపు, పిల్లలను కనడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లను లక్ష్యంగా చేసుకుంటూ ఘాటు విమర్శలు చేశారు.
పిల్లల్ని కనడానికి ఎక్కడైనా వేలంపాట పెడతారా..? ప్రజలకు మాత్రం ఎక్కువ మంది పిల్లలను కంటే రూ.30 వేలు, రూ.40 వేలు ఇస్తామని వేలంపాటలు పెడుతున్నారు అని ఆరోపించారు.
చంద్రబాబు నాయుడు, వాళ్ల అబ్బాయి లోకేష్ మాత్రం తమ కుటుంబాల్లో ఒక్కొక్కరినే కంటారు. కానీ, సామాన్య ప్రజలను మాత్రం ఎక్కువ మంది పిల్లల్ని కనమని చెప్పడానికి చంద్రబాబుకు అసలు నైతిక హక్కు ఎక్కడుంది? అని ప్రశ్నించారు. మంత్రి నారా లోకేష్‌ను ఉద్దేశించి అంబటి రాంబాబు సరికొత్త పేరుతో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఆయన లోకేష్ కాదు.. 'లవ్ క్యాష్'… లోకేష్ ఎప్పుడూ క్యాష్ (డబ్బు)ను మాత్రమే లవ్ చేస్తాడు. అందుకే ఆయనకు ఆ పేరు చాలా చక్కగా సరిపోతుంది. గతంలో నా మిత్రుడు, దివంగత నందమూరి హరికృష్ణ కూడా లోకేష్ గురించి ఒక కీలకమైన మాట చెప్పారు అని అంబటి రాంబాబు గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వం జనాభా నియంత్రణ విధానాలపై తీసుకుంటున్న నిర్ణయాలను, వారి వ్యక్తిగత జీవితాలను ముడిపెడుతూ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
