సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి . కావలిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడారంటూ ఆయన మండిపడ్డారు.
మత్స్యకారుల సంక్షేమం, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై వాస్తవాలను మీడియా ముందుంచారు.
మత్స్యకారుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన చంద్రబాబు, ఇప్పుడు వారిపై మొసలి కన్నీరు కారుస్తున్నారని కాకాణి విమర్శించారు. చంద్రబాబు పాలనలో మత్స్యకారులకు జరిగిన లబ్ధి శూన్యమని, వారిని నిండా ముంచిన చరిత్ర చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమం కోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు కాకాణి గుర్తుచేశారు.
వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఇచ్చే 'మత్స్యకార భరోసా'ను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.10,000లకు పెంచిందని చెప్పారు. ఐదేళ్ల కాలంలో కేవలం ఈ పథకం ద్వారానే రూ.538 కోట్లు మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో నేరుగా జమ చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు.
కావలి నియోజకవర్గ పరిధిలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ విషయంలో చంద్రబాబు తప్పుడు క్రెడిట్ తీసుకుంటున్నారని కాకాణి ఆరోపించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం వంద శాతం పూర్తయింది. అన్ని పనులు పూర్తి చేసిన ప్రాజెక్టును తానే పూర్తి చేసినట్లు చంద్రబాబు కావలి సభలో బిల్డప్ ఇస్తున్నారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని ఆరోపించారు కాకాణి.ఇప్పటికైనా చంద్రబాబు అబద్ధాలు చెప్పడం మానుకుని, మత్స్యకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
