అదనపు కట్నం కోసం అత్తగారింటి వేధింపులు ఒక వివాహిత ప్రాణాలను బలితీసుకున్నాయి. ప్రాణభయంతో తన అక్కకు అత్యవసర మెసేజ్ పంపిన కేవలం ఏడు నిమిషాల వ్యవధిలోనే ఆ చెల్లెలు విగతజీవిగా మారిన అత్యంత విషాదకరమైన ఘటన దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో (గ్రేటర్ నోయిడా) వెలుగుచూసింది.
బాధిత మహిళ (నిక్కీ భాటి) తన అత్తగారింట్లో ఎదుర్కొంటున్న నరకాన్ని భరించలేక అర్ధరాత్రి వేళ తన అక్క (కాంచన్) కు వాట్సాప్‌లో ఒక ఆడియో/టెక్స్ట్ రూపంలో సందేశం పంపింది. బచావో లో దీదీ… నన్ను కాపాడు అక్కా, నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు, ఇక్కడ ఏదో జరగబోతోంది అంటూ ఆ మెసేజ్‌లో ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఆ మెసేజ్ చూసుకుని, అప్రమత్తమై ఏం జరిగిందో తెలుసుకునే లోపే.. అంటే సరిగ్గా 7 నిమిషాల తర్వాత నిక్కీ మరణించిందనే వార్త ఆ అక్క చెవిన పడింది.
నిక్కీ వివాహం జరిగినప్పటి నుండి ఆమె భర్త (విపిన్ భాటి), అత్తగారి కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం నిరంతరం వేధిస్తూనే ఉన్నారు. పెళ్లి సమయంలో టాప్-మోడల్ స్కార్పియో కారు, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్, భారీగా బంగారం, నగదు ఇచ్చినప్పటికీ వారి ఆశ తీరలేదు. ఇంకా రూ. 36 లక్షల అదనపు నగదు తేవాలంటూ ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించారు. నిక్కీ ఒక బ్యూటీ పార్లర్ నడుపుతూ తన ఆరేళ్ల కొడుకును సాకుతుండగా.. ఆమె సంపాదనను కూడా లాక్కునేవారని సోదరి ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ దారుణానికి సంబంధించి బాధిత సోదరి కాంచన్ సేకరించిన కొన్ని భయానక వీడియో క్లిప్స్ లభ్యమయ్యాయి. అందులో భర్త, అత్త కలిసి నిక్కీని తీవ్రంగా కొడుతున్న దృశ్యాలు ఉన్నాయి. మరో హృదయవిదారక వీడియోలో ఒంటికి నిప్పంటుకుని మంటల్లో కాలిపోతూ ఆమె మెట్ల మీద నుండి కిందకు పడిపోతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఈ ఘోరాన్ని ఆమె ఆరేళ్ల కుమారుడు కళ్లారా చూశాడు. వాళ్లు మొదట మమ్మీపై ఏదో ద్రవం పోశారు, ఆపై కొట్టి లైటర్‌తో నిప్పు పెట్టారు అని ఆ చిన్నారి పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొనడం గమనార్హం.

