Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

నీట్ పేపర్ లీక్..పూణే ప్రొఫెసర్ బుక్!

నీట్ (NEET-UG 2026) పేపర్ లీకేజీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మరో కీలక మాస్టర్‌మైండ్ మనీషా గురునాథ్ మాంధారేను అరెస్ట్ చేసింది.

పూణేకు చెందిన ఈమె సీనియర్ బోటనీ (వృక్షశాస్త్రం) ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. బయాలజీ (జీవశాస్త్రం) ప్రశ్నపత్రం లీకేజీ వెనుక ఈమెనే ప్రధాన సూత్రధారి అని సీబీఐ పేర్కొంది.

మనీషా మాంధారేను నీట్-యూజీ 2026 పరీక్షల ప్రక్రియకు నిపుణురాలిగా NTA నియమించింది. దీనివల్ల ఆమెకు బోటనీ, జూలజీ ప్రశ్నపత్రాలను చూసే పూర్తి అవకాశం లభించిందని సీబీఐ తెలిపింది. దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 2026లో పూణేకు చెందిన మనీషా వాగ్మారే (ఈమెను మే 14నే అరెస్ట్ చేశారు) ద్వారా మనీషా మాంధారే పలువురు నీట్ అభ్యర్థులతో పరిచయాలు పెంచుకుంది.

ఆ తర్వాత ప్రత్యేక క్లాసులు నిర్వహించి బోటనీ, జూలజీ సబ్జెక్టుల నుండి రాబోయే పలు ప్రశ్నలను విద్యార్థులకు వివరించింది. వాటిని నోట్‌బుక్స్‌లో రాసుకోవాలని, టెక్స్ట్‌బుక్స్‌లో మార్క్ చేసుకోవాలని చెప్పింది. మే 3న జరిగిన అసలు నీట్ యూజీ 2026 పరీక్షలో మెజారిటీ ప్రశ్నలు ఆమె చెప్పిన వాటితోనే సరిపోలాయి. గత 24 గంటల్లో సీబీఐ దేశవ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, లాప్‌టాప్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది.

ఈ కేసులో ఇప్పటివరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, అహిల్యానగర్ ప్రాంతాల నుండి తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఐదుగురిని ఇప్పటికే కోర్టులో హాజరుపరిచి, పూర్తి విచారణ కోసం ఏడు రోజుల పోలీసు కస్టడీకి తీసుకున్నారు. నిన్న అరెస్ట్ అయిన మరో ఇద్దరు నిందితులను పూణే కోర్టులో హాజరుపరిచి, ట్రాన్సిట్ రిమాండ్ ద్వారా ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం వారిని ఢిల్లీ కోర్టులో హాజరుపరుస్తున్నారు.

మరోవైపు, ఈ పేపర్ లీక్ కేసులో ప్రధాన సూత్రధారి (కింగ్‌పిన్) పి.వి. కులకర్ణికి సహకరించిన మరో ఇద్దరు సహచరుల కోసం సీబీఐ సోదాలను ముమ్మరం చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పి.వి. కులకర్ణి, మనీషా వాగ్మారేలతో పాటు మరో ఇద్దరు లెక్చరర్లు కూడా ఈ పేపర్ లీకేజీలో కీలక పాత్ర పోషించారు. వీరి కోసం సీబీఐ పూణే, లాతూర్ ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. నీట్ పేపర్ లీక్ ప్రధాన నిందితుడు పి.వి. కులకర్ణిని శుక్రవారం (మే 15) పూణేలో అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ రిమాండ్ పొందిన అనంతరం ఆయనను నేడు సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు.

పి.వి. కులకర్ణి దయానంద్ కాలేజీలో గత 28 ఏళ్లుగా కెమిస్ట్రీ (రసాయన శాస్త్రం) టీచర్‌గా పనిచేశారు. ప్రొఫెసర్‌గా, ఆ తర్వాత ప్రిన్సిపాల్‌గా సేవలు అందించి నాలుగేళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. తన పదవీకాలంలో ఆయన పూణేకు చెందిన "డైనమిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్ ఎన్‌హ్యాన్స్‌మెంట్ అండ్ రీసెర్చ్" (DEEPER) అనే విద్యాసంస్థతో కలిసి పనిచేశారు. రిటైర్మెంట్ తర్వాత పలు కోచింగ్ సెంటర్లలో ఫ్రీలాన్సర్‌గా కెమిస్ట్రీ బోధించేవారు.

గత రెండేళ్లుగా కులకర్ణి నేషనల్ Testing ఏజెన్సీ (NTA) లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కెమిస్ట్రీ నిపుణుడిగా పనిచేస్తున్నారు. నీట్ 2026 పరీక్షకు కెమిస్ట్రీ పేపర్‌ను తయారు చేసిన ప్రొఫెసర్లలో ఈయన కూడా ఒకరని సమాచారం. ఈ కారణం చేతనే ఆయనకు పరీక్షా పత్రం సులువుగా చేజిక్కిందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu