Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓ వైపు తీవ్ర ఎండలు.. మరోవైపు వర్షాలు!

ఓ వైపు తీవ్ర ఎండలు.. మరోవైపు వర్షాలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు విభిన్నమైన వాతావరణ పరిస్థితులు తలెత్తనున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది.

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భానుడి భగభగలు కొనసాగుతుండగా మరికొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వాతావరణంలో వస్తున్న ఈ అకస్మాత్తు మార్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇవాళ రాష్ట్రంలోని 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. మరో 64 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం నుండి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ఎండ తీవ్రతతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే వింత వాతావరణం మరో రెండు రోజుల పాటు కొనసాగుతుందని ఆయన వివరించారు. పోలవరం ప్రాంతం…కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో గరిష్టంగా 45 నుండి 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.

నైరుతి బంగాళాఖాతంతో పాటు తమిళనాడు తీరాన్ని ఆనుకుని కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం కారణంగా రాయలసీమ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వెల్లడించారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో శని, ఆదివారాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడా చెదురుమొదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు పడవచ్చు.

ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద లేదా హోర్డింగుల కింద నిలబడవద్దని అధికారులు హెచ్చరించారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే రైతులు, పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, గుండె జబ్బులు, మధుమేహం, బీపీ ఉన్నవారు అదనపు జాగ్రత్తలు తీసుకుంటూ నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరినీళ్లు, తాగునీరు ఎక్కువగా తీసుకోవాలని స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu