Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని కాల్చి చంపి..!

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని కాల్చి చంపి..!

మెరికా (USA)లో రోజురోజుకూ మితిమీరిపోతున్న గన్ కల్చర్ తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా అయోవా (Iowa) రాష్ట్రంలోని మస్కటీన్ నగరంలో పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న వరుస కాల్పుల ఘటనల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘాతుకానికి ఒడిగట్టిన అనుమానిత నిందితుడు కూడా చివరకు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, మొత్తం ఈ ఘటనల్లో ఏడుగురు మరణించారని మస్కటీన్ పోలీసులు వెల్లడించారు. ఒకే కుటుంబంలో తలెత్తిన తీవ్రమైన వివాదాల వల్లే ఈ సామూహిక హత్యలు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

వివరాల్లోకి వెళ్తే.. మస్కటీన్ లోని 210 పార్క్ అవెన్యూలో ఉన్న ఒక నివాసంలో కాల్పులు జరిగాయని సమాచారం రావడంతో పోలీసులు, వైద్య సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ తీవ్రమైన తుపాకీ గాయాలతో పడి ఉన్న నలుగురిని గుర్తించారు. అయితే వారిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే లోపే ఆ నలుగురూ ప్రాణాలు విడిచారు. ఈ దారుణానికి పాల్పడింది మస్కటీన్‌కు చెందిన ర్యాన్ విల్లీస్ (52) అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకునే లోపే నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు.

పోలీసులు అతడి కోసం నగరవ్యాప్తంగా గాలిస్తుండగా.. మరో ప్రాంతంలో విల్లీస్ తనే స్వయంగా తుపాకీతో కాల్చుకుని విగతజీవిగా పడి ఉన్నట్లు గుర్తించారు. కేవలం ఆ ఇల్లే కాకుండా, మస్కటీన్‌లోని మరొక నివాసంలో మరియు గ్రాండ్‌వ్యూ అవెన్యూలో ఉన్న ఒక వ్యాపార సముదాయంలో కూడా తుపాకీ గాయాలతో మరో ఇద్దరు వ్యక్తులు మరణించి ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. నిందితుడు ర్యాన్ విల్లీస్ పక్కా ప్లాన్‌తో తన కుటుంబ సభ్యులను వేర్వేరు చోట్ల టార్గెట్ చేసి కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వరుస కాల్పుల ఉదంతాలపై మస్కటీన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu