Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పరాయి వ్యక్తితో చాటింగ్‌ చేస్తోందని.. భార్యను..

పరాయి వ్యక్తితో చాటింగ్‌ చేస్తోందని.. భార్యను..

పుదుచ్చేరి పరిధిలోని యానాంలో అత్యంత అమానుష ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో కన్న భర్తే ఆమె ప్రాణాలు తీశాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

యానాం పరిధిలోని మత్స్యకారపేటకు చెందిన చెక్కా అప్పారావు (29), భీంనగర్‌కు చెందిన పువ్వల రేఖ (26) ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాలుగేళ్ల బాబు, రెండేళ్ల పాప ఉన్నారు. అప్పారావు చేపలు వేటాడుతూ జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

గత శుక్రవారం రాత్రి అప్పారావు చేపల వేట నుంచి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తన కుమారుడికి మొబైల్ ఫోన్ ఇచ్చి అతను స్నానానికి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగొచ్చి చూసేసరికి, అదే ఫోన్‌ నుంచి తన భార్య రేఖ ఎవరితోనో చాటింగ్‌ చేస్తూ కనిపించింది.

అది చూసిన అప్పారావు ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఆవేశం అణచిలేక భార్య ముఖంపై విచక్షణారహితంగా పిడిగుద్దులు గుద్దాడు. భర్త దెబ్బలకు ఆమె కిందపడిపోయింది. అనంతరం ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో భార్య గొంతునులిమి హత్య చేశాడు.

ఆ తర్వాత రాత్రి సమయంలోనే అప్పారావు తన ఆటోలో భార్య మృతదేహాన్ని రహస్యంగా తీసుకెళ్లాడు. స్థానిక వంతెనపై నుంచి కోరింగ నదిలో ఆ శవాన్ని విసిరేశాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు శనివారం ఉదయం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి నాటకం ఆడాడు.

అయితే పోలీసులకు అప్పారావు ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో అప్పారావు అసలు నిజం ఒప్పుకున్నాడు. భార్యను తానే హత్య చేసి నదిలో పడేసినట్లు అంగీకరించాడు.

నిందితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వంతెన నుంచి సుమారు 300 మీటర్ల దూరంలో రేఖ మృతదేహం లభించింది. పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu