రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా ట్రైలర్ లాంచ్ తర్వాత ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. గ్రామీణ క్రీడల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ అంతా సిద్ధం చేశారు.
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. ఇటీవల మేకర్స్ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఇందులో రామ్ చరణ్ మరియు డైరెక్టర్ బుచ్చిబాబు ఇద్దరూ కలిసి కార్ డ్రైవ్ చేస్తూ ముచ్చటించారు. ఈ సంభాషణలో చరణ్ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో వచ్చే 'ఢిల్లీ ఎపిసోడ్' తనకు అత్యంత ఇష్టమైన భాగమని చరణ్ చెప్పారు. అంతేకాదు, ఆ ఎపిసోడ్‌లో వచ్చే ఒక మేజర్ ట్విస్ట్‌ను దర్శకుడు బుచ్చిబాబు అత్యంత అద్భుతంగా డిజైన్ చేశారని చరణ్ ప్రశంసించారు.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తుండగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
