భారతదేశం, నెదర్లాండ్స్ దేశాల మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలు మరియు ప్రజల మధ్య ఉన్న బంధాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. నెదర్లాండ్స్‌లోని 'ది హేగ్' నగరంలో నిర్వహించిన భారతీయ సమాజం ఘన స్వాగత కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
ఇక్కడి ప్రవాస భారతీయుల ప్రేమాభిమానాలు చూస్తుంటే.. 'ది హేగ్' నగరం భారత-నెదర్లాండ్స్ స్నేహానికి సజీవ చిహ్నంగా మారిందని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.
నెదర్లాండ్స్ దేశం 'ట్యూలిప్' (Tulip) పూలకు ఎంతో ప్రసిద్ధి చెందింది, అలాగే భారతదేశానికి 'తామర' (Lotus) పువ్వు ప్రత్యేక గుర్తింపు. ఈ రెండు పూల విశిష్టతను ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ.. "నెదర్లాండ్స్ ట్యూలిప్ పూలకు ప్రసిద్ధి, భారత్ తామర పూలకు నిదర్శనం. ఈ రెండు పూలు మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతాయి. వాటి వేళ్లు నీటిలో ఉన్నా, లేదా భూమిలో ఉన్నా.. అవి అందాన్ని మరియు బలాన్ని రెండింటినీ పొందుతాయి" అని ఇరు దేశాల బంధాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఇక్కడి భారతీయుల ఉత్సాహాన్ని చూస్తుంటే తాను నెదర్లాండ్స్‌లో ఉన్నాననే విషయాన్ని కాసేపు మర్చిపోయానని, భారతదేశంలోనే ఏదో పండుగలో పాల్గొంటున్నట్లు అనిపించిందని ప్రధాని అన్నారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. మొదట కరోనా మహమ్మారి, ఆ తర్వాత యుద్ధాలు, ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభం వల్ల ఏర్పడిన ఇంధన సంక్షోభం వంటి సవాళ్లతో ఈ దశాబ్దం నిండిపోయిందని అన్నారు. ఈ పరిస్థితులను త్వరగా మార్చకపోతే గత దశాబ్దాలుగా సాధించిన విజయాలు వృథా అయిపోతాయని, ప్రపంచ జనాభాలో పెద్ద భాగం మళ్లీ పేదరికంలోకి నెట్టబడుతుందని హెచ్చరించారు.
ఇలాంటి క్లిష్ట సమయాల్లో భారత్, నెదర్లాండ్స్ దేశాలు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా బలమైన, స్థితిస్థాపకత కలిగిన సరఫరా గొలుసును ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ప్రస్తుత భారతదేశం ఎన్నడూ లేని విధంగా అపూర్వమైన పరివర్తన దశను ఎదుర్కొంటోందని ప్రధాని అన్నారు. "ఈరోజు భారత్ పెద్ద కలలు కంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సెమీకండక్టర్ల రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు భారతీయ యువత ఆరాటపడుతోంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు భారత్ నిలయంగా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ నిధుల ఆరోగ్య బీమా పథకాన్ని (ఆయుష్మాన్ భారత్) మన దేశం నడుపుతోంది" అని మోదీ గర్వంగా ప్రకటించారు.
నెదర్లాండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలని, భారత్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ ప్రవాసులకు పిలుపునిచ్చారు. భారతదేశానికి మీ వంతు సహకారం అందించండి. ఇది దేశ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, మీ పెట్టుబడులపై మరింత లాభాలను అందిస్తుంది. ఇది మోదీ గ్యారెంటీ అని ఆయన స్పష్టం చేశారు.
ఐదు దేశాల పర్యటనలో భాగంగా యూఏఈ (UAE) పర్యటన ముగించుకుని నెదర్లాండ్స్ చేరుకున్న ప్రధాని మోదీకి భారతీయ నిపుణులు, విద్యార్థులు, సూరినామి-హిందుస్తానీ సమాజం ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యంగా సాంకేతిక రంగంలో పనిచేస్తున్న భారతీయ ప్రొఫెషనల్స్, డచ్ విశ్వవిద్యాలయాలలో ఇన్నోవేషన్ రంగాల్లో చదువుతున్న విద్యార్థులు ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేస్తున్నారని ప్రధాని కొనియాడారు. క్రికెట్, హాకీ వంటి క్రీడలు కూడా ఇరు దేశాల ప్రజలను దగ్గర చేస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.
