Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

రేవంత్ 'పీఏ'నంటూ వసూళ్ల పర్వం!

తెలంగాణలో ముఖ్యమంత్రి మరియు మంత్రుల పేర్లు వాడుకుంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కేటుగాళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా, తాను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఏనంటూ పరిచయం చేసుకుని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించి వసూళ్లకు తెరలేపిన వ్యక్తిని మెదక్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.

మెదక్ జిల్లా శివంపేట మండలం మునీరాబాద్ గ్రామ శివారులో 'ఆర్ఆర్ రియల్ ఎస్టేట్' సంస్థ ఒక ల్యాండ్ వెంచర్‌ను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో శివంపేట గ్రామానికి చెందిన ఉప్పల సంతోష్ గుప్తా అనే వ్యక్తి సదరు రియల్ ఎస్టేట్ సంస్థ యజమానికి ఫోన్ చేశాడు. తాను సీఎం రేవంత్ రెడ్డి పీఏనంటూ పరిచయం చేసుకున్నాడు.

సదరు సంస్థకు చెందిన ల్యాండ్ వెంచర్ భూమి తీవ్రమైన లీగల్ సమస్యల్లో ఉందని, దానిని తానే స్వయంగా క్లియర్ చేయిస్తానని నమ్మబలికాడు. తనకు రాష్ట్ర క్యాబినెట్‌లోని కీలక మంత్రులతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అడిగినంత డబ్బులు ఇస్తే ప్రభుత్వ స్థాయిలో ఉన్న మీ సమస్యలన్నింటినీ చిటికెలో పరిష్కరిస్తానని సంతోష్ గుప్తా వ్యాపారవేత్తకు ఎర వేశాడు. లేనిపక్షంలో వెంచర్‌ను ముందుకు సాగనివ్వనని బెదిరింపులకు గురిచేశాడు.

సంతోష్ గుప్తా ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ సంస్థ యజమాన్యం తక్షణమే స్థానిక పోలీసులను ఆశ్రయించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడు ఉప్పల సంతోష్ గుప్తాను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు కేవలం సీఎం పీఏ అని అబద్ధాలు చెప్పడమే కాకుండా.. గతంలో వివిధ సందర్భాల్లో రాష్ట్ర మంత్రులతో దిగిన ఫోటోలను తన మొబైల్‌లో చూపిస్తూ స్థానిక వ్యాపారవేత్తలను, బిల్డర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఫోటోలను అడ్డం పెట్టుకుని పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉందంటూ పెద్ద ఎత్తున వసూళ్ల దందాకు తెరలేపినట్లు తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu