తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న తాజా పరిస్థితులు, సినిమా టికెట్ల ధరలు మరియు థియేటర్ల నిర్వహణపై చర్చించేందుకు చిత్ర పరిశ్రమకు చెందిన కీలక వ్యక్తులు సమావేశమయ్యారు.
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు డి. సురేష్ బాబు నేతృత్వంలో ఈ భేటీ జరిగింది.
ఈ సమావేశంలో టాలీవుడ్‌లోని బడా నిర్మాతలు మరియు ప్రముఖ ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. నిర్మాతల తరపున అల్లు అరవింద్, సుప్రియ యార్లగడ్డ, 'స్రవంతి' రవి కిషోర్, మైత్రీ మూవీ మేకర్స్ నుంచి నవీన్ (మైత్రీ) రవి మరియు చెర్రీ, సి. కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, ధీరజ్ మొగిలినేని తదితరులు హాజరయ్యారు.
ఎగ్జిబిటర్ల తరపున సునీల్ నారంగ్ (ఏషియన్ సినిమాస్), విజయేందర్ రెడ్డి, శ్రీధర్ మరియు ఇతర కీలక సభ్యులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఈ భేటీలో ముఖ్యంగా సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక మరియు నిర్వహణ పరమైన సవాళ్లపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా టికెట్ ధరలను ఎలా సమతుల్యం చేయాలనే అంశంపై చర్చించారు.
థియేటర్లలో విడుదలైన ఎన్ని రోజులకు సినిమాలను ఓటీటీలోకి తీసుకురావాలనే నిబంధనపై మరోసారి సమీక్ష జరిపారు. త్వరలోనే ఈ చర్చలకు సంబంధించి అధికారికమైన నిర్ణయాలను ఛాంబర్ వెల్లడించే అవకాశం ఉంది.
