తమిళనాడు రాజకీయాల్లో కాంగ్రెస్-డీఎంకే కూటమి మధ్య తలెత్తిన విభేదాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ వేస్తున్న వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
ఎందుకంటే విజయ్ సీఎం కావడం.. డీఎంకేకు షాకిస్తూ టీవీకేకు సపోర్టు చేసిన కాంగ్రెస్… విజయ్ కేబినెట్ లో చేరింది. ఇది ఇండియా కూటమిలో లుకలుకలను బయటపెట్టగా తమిళనాట బలపడేందుకు ఇదే సరైన సమయం అని కమలనాథులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి తమిళనాడు అసెంబ్లీ సీట్ల సర్దుబాటు, స్థానిక సంస్థల ఎన్నికలు మరియు కొన్ని కీలక విధానపరమైన నిర్ణయాలలో డీఎంకే వైఖరి పట్ల తమిళనాడు కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. డీఎంకే తమను కేవలం ఒక జూనియర్ పార్టనర్‌గా చూస్తూ, తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కాంగ్రెస్ అంతర్గత వర్గాల్లో గళం విప్పుతున్నారు. మరోవైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు తమ ప్రాంతీయ ప్రయోజనాలకు గండి కొడుతున్నాయని డీఎంకే నేతలు భావిస్తున్నారు.
ఈ రెండు మిత్రపక్షాల మధ్య వస్తున్న బీటలను గమనించిన బీజేపీ నాయకత్వం తమిళనాడులో తన ఉనికిని మరింత చాటుకునేందుకు ఈ అవకాశాన్ని వాడుకోవాలని చూస్తోంది. డీఎంకే వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ శ్రేణులను, ముఖ్యంగా క్షేత్రస్థాయి బలం ఉన్న కీలక నాయకులను తమ పార్టీ వైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఒకప్పుడు ఎంతో బలంగా కనిపించిన ఈ కూటమిలో ఇప్పుడు స్వార్థ రాజకీయాల వల్లే విభేదాలు వచ్చాయని, ఇది రాష్ట్ర ప్రగతికి గొడ్డలిపెట్టు అని బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. తమిళనాడులో ఎప్పుడూ ద్రవిడ పార్టీల (DMK, AIADMK) మధ్యే రాజకీయం నడుస్తుంటుంది. అయితే ఇప్పుడున్న శూన్యతను ఆసరాగా చేసుకుని, కాంగ్రెస్ కంటే తామే బలమైన జాతీయ ప్రత్యామ్నాయ శక్తి అని నిరూపించుకోవడానికి బీజేపీ పావులు కదుపుతోంది.
వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తమిళనాట ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్నబీజేపీ పార్టీకి డీఎంకే-కాంగ్రెస్ మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ ఒక బంగారు అవకాశంగా మారింది. ఈ రాజకీయ చదరంగంలో కాంగ్రెస్ తన మిత్రపక్షంతో సర్దుకుపోతుందా లేదా బీజేపీ ఈ సంక్షోభాన్ని పూర్తిగా క్యాష్ చేసుకుంటుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.
