Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

తెలంగాణ బీజేపీలో నిధుల గోల్‌మాల్!

తెలంగాణ బీజేపీలో నిధుల గోల్‌మాల్ వ్యవహారం కలకలం రేపుతోంది. పార్టీ పంపిన నిధులను నాయకులు సొంతానికి వాడుకోవడంపై అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు అధ్యక్షత వహించారు. పార్టీ రాష్ట్ర సహ ఇన్‌చార్జి అభయ్ పాటిల్, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి మధుకర్ ఇందులో పాల్గొన్నారు.

సమావేశంలో అభయ్ పాటిల్ రాష్ట్ర నేతల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో అభ్యర్థుల ప్రచారం కోసం పార్టీ నిధులు పంపింది. అయితే చాలామంది నేతలు ఆ నిధులను అభ్యర్థులకు ఇవ్వకుండా కాజేశారని పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు స్వాహా చేసిన నాయకులను ఇప్పటికే గుర్తించినట్లు ఆయన స్పష్టం చేశారు. తీసుకున్న డబ్బును వెంటనే పార్టీకి తిరిగి ఇచ్చేయాలని ఆదేశించారు. లేకపోతే క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని జిల్లా అధ్యక్షులను హెచ్చరించారు.

నాయకులు ఫోటోలకు మాత్రమే పోజులు ఇస్తే సరిపోదని పాటిల్ హితవు పలికారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. తాను ఇక్కడి నుంచి ఎక్కడికీ వెళ్లనని, పార్టీ బాధ్యతల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. అలాగే సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్ మాట్లాడుతూ.. ఏసీ గదుల్లో కూర్చుంటే పార్టీ అధికారంలోకి రాదని తేల్చి చెప్పారు. పార్టీలో క్రియాశీలక సభ్యత్వం లేని 30 మందికి కీలక పదవులు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.

సమావేశం తర్వాత కొందరు జిల్లా అధ్యక్షులు అభయ్ పాటిల్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నిధుల పంపిణీలో మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జిల పాత్ర కూడా ఉందని నేతలు తెలిపారు. పార్టీ కార్యాలయాల నిర్వహణకు ప్రతి నెలా ఆర్థిక సాయం అందించాలని కోరారు. దీనిపై అధిష్ఠానం సానుకూలంగా స్పందించింది. రాబోయే ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలకు బూత్ స్థాయి నుంచే సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు నాయకత్వం పిలుపునిచ్చింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu