తెలంగాణలోని వివిధ రంగాల కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. కార్మికుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాష్ట్రంలో కనీస వేతనాలను భారీగా పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
పెరిగిన వేతనాలు రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రైవేట్, ఒప్పంద, దినసరి కార్మికులకు ఆర్థికంగా కొండంత అండగా నిలవనున్నాయి.
రాష్ట్రంలో కనీస వేతనాలను (Minimum Wages) సవరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ (మంత్రుల ఉపసంఘం) సమర్పించిన నివేదికను ప్రభుత్వం పూర్తిగా ఆమోదించింది. ఈ నివేదిక సిఫార్సుల మేరకు రాష్ట్రాన్ని మొత్తం మూడు జోన్లుగా విభజించి, కార్మికుల నైపుణ్యాల ఆధారంగా వేతనాలను భారీగా పెంచారు.
ఈ పెంచిన కొత్త వేతనాలు వచ్చే జూన్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా, ఆర్థికంగా ముందంజలో ఉన్న ప్రాంతాలను జోన్-1 కిందికి చేర్చారు. ఈ జోన్ పరిధిలోని కార్మికులకు పెరిగిన వేతనాల వివరాలు కింది విధంగా ఉన్నాయి:
అన్‌స్కిల్డ్ (నైపుణ్యం లేని) కార్మికులు..వీరి కనీస వేతనాన్ని ఇప్పటివరకు ఉన్న రూ.12,750 నుంచి ఏకంగా రూ.16,000 కి పెంచారు.
సెమీస్కిల్డ్ కార్మికులు..వీరి వేతనాన్ని రూ.13,592 ల నుంచి రూ.17,000 కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
స్కిల్డ్ (నైపుణ్యం కలిగిన) కార్మికులు..పరిశ్రమల్లో కీలకమైన స్కిల్డ్ కార్మికుల వేతనాన్ని రూ.13,772 నుంచి రూ.18,500 కి పెంచారు.
హైస్కిల్డ్ (ఉన్నత నైపుణ్యం కలిగిన) కార్మికులు..వీరి వేతనాన్ని రూ.14,607 నుంచి ఏకంగా రూ.20,000 కి పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.
