ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
అధికార పార్టీ టీడీపీ మెజార్టీ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకునేలా అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తుండగా ఏకగ్రీవాలకు బ్రేకులు వేసే పనిలో ఉంది వైసీపీ. ఇందుకు సంబంధించి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటికే నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు కూడా.
దీంతో ఇప్పుడు లోకల్ ఎన్నికల ఫైట్ లో ఎవరిది పైచేయి అవుతుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కూటమి తరపున పార్టీ జెండా మోసిన వారికి పోటీ అవకాశం కల్పించాలని ఇప్పటికే మహానాడు వేదికగా తీర్మానం చేసింది టీడీపీ. పార్టీ కోసం కష్టపడిన వారికి కచ్చితంగా టికెట్లు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు కూడా. అంతేగాదు ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని నేతలకు సూచించారు. దీంతో తెలుగు తమ్ముళ్లు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా స్థానిక ఎన్నికలపై గురిపెట్టారు. ఏకగ్రీవాలు కాకుండా చూడాలని…ప్రతి స్థానంలోనూ పోటీ ఉండేలా అభ్యర్థులను ఇప్పటినుంచే రెడీ చేయాలని లీడర్లకు సూచించారు. దీంతో ఒక్కసారిగా ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.
2021-22లో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం స్థానాలను సొంతం చేసుకుంది. అయితే వైసీపీ కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చి 90 శాతం సీట్లలో పాగా వేయాలని భావిస్తోంది టీడీపీ. కానీ కూటమి పార్టీలో ఉన్న లుకలుకలు మైనస్‌గా మారే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు అధికార పక్షంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది వైసీపీ. నియోజకవర్గ ఇంచార్జ్‌లకు క్లీయర్‌కట్ మెస్సేజ్ ఇచ్చిన జగన్.. ఓడిపోయిన చోట ఇంఛార్జీలు ఫెయిల్ అయినట్లు భావించాల్సి ఉంటుందని చెప్పడంతో ఆ పార్టీ నేతలు ఎన్నికల రణక్షేత్రాన్ని ఇప్పటికే ప్రారంభించారు కూడా.
మొత్తంగా ఏపీలో దాదాపు 13 వేల 326 గ్రామ పంచాయతీలు, 660 జడ్పీటీసీ స్థానాలు, 10వేలకి పైగా ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండటంతో పల్లెల్లో ఎలక్షన్ హీట్ అప్పుడే మొదలైపోయింది.

