హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాల గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు మరోసారి రట్టు చేశారు.
ప్రయాణికుల లగేజీ బ్యాగులను అత్యంత చాకచక్యంగా తనిఖీ చేసి, కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
బ్యాంకాక్ నుండి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికులపై డీఆర్‌ఐ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో వారి లగేజీ బ్యాగులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో వారి బ్యాగుల లోపల అనుమానాస్పదంగా ఉన్న 24 ప్యాకెట్లను అధికారులు గుర్తించారు.
కస్టమ్స్ కళ్ళు కప్పేందుకు సదరు కేడీలు ఎవరూ ఊహించని విధంగా ప్లాన్ చేశారు. సాధారణంగా ప్రయాణికులు తెచ్చుకునే ఆలూ చిప్స్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, ఇతర స్నాక్స్ డబ్బాల లోపల ఈ డ్రగ్స్‌ను దాచి తరలిస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ ప్యాకెట్లను తెరిచి చూడగా అందులో అత్యంత ఖరీదైన హైడ్రోఫోనిక్ గంజాయి ఉన్నట్లు తేలింది. ఇద్దరు నిందితుల నుండి మొత్తం 8.705 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ. 3.05 కోట్లు ఉంటుందని డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు.
ఇది సాధారణ గంజాయిలా కాకుండా, మట్టి లేకుండా కేవలం ప్రత్యేకమైన పోషకాలు గల నీటి ఆధారిత ద్రావణాలను ఉపయోగించి ఇండోర్ (గదుల లోపల) పద్ధతిలో సాగు చేస్తారు. ఇందులో మత్తును కలిగించే కెమికల్స్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో దీనికి భారీ డిమాండ్, ధర ఉంటాయి.
