వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి (బుధవారం) పార్టీ ముఖ్య నేతలతో ఆయన విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు ఈ భేటీని ఏర్పాటు చేశారు.
ఈ కీలక సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు మరియు ఎమ్మెల్సీలు అందరూ విధిగా హాజరుకానున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ పరంగా ఎలా ఎదుర్కోవాలి, అభ్యర్థుల ఎంపిక మరియు క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ నేతలకు రూట్ మ్యాప్ ఇవ్వనున్నారు.
సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, వివిధ స్థాయిల్లో నూతన కమిటీల నిర్మాణం మరియు నియామకాలపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన ఎస్‌ఐఆర్ వ్యవహారంపై పార్టీ పరంగా ఎలా స్పందించాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.
నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ఈ సమావేశంలో ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలపై ప్రజాక్షేత్రంలోకి ఎలా వెళ్లాలో నేతలకు వివరించనున్నారు.
ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా ఈ సమావేశం సాగనుంది. క్షేత్రస్థాయి నుండి క్యాడర్‌ను యాక్టివేట్ చేయడం, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిలదీయడంపై అధినేత వైఎస్ జగన్ స్పష్టమైన లైన్ ఇవ్వనున్నారు ఇవ్వనున్నారు జగన్. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, ఎల్లుండి జరగబోయే వైఎస్ జగన్ విస్తృతస్థాయి సమావేశం ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

