తమిళనాడు నూతన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తన మంత్రివర్గంలోని మంత్రులకు శాఖలను కేటాయించారు. అత్యంత కీలకమైన హోం శాఖను విజయ్ తన వద్దే ఉంచుకోగా, ఆయన నమ్మకస్థుడు, సీనియర్ టీవీకే (TVK) నాయకుడు అయిన కేఏ సెంగోట్టయన్‌కు ఆర్థిక శాఖను అప్పగించారు.
తమిళనాడు 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే, శనివారం నాడు తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్.. తనతో కలిపి మొత్తం 10 మంది మంత్రులకు పోర్ట్‌ఫోలియోలను కేటాయించారు. ముఖ్యమంత్రి విజయ్ హోం శాఖతో పాటు పబ్లిక్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, మహిళా మరియు యువజన సంక్షేమ శాఖలను తన వద్దే ఉంచుకున్నారు.
78 ఏళ్ల సీనియర్ నేత, విజయ్ ఆప్తమిత్రుడు కేఏ సెంగోట్టయన్‌కు ఆర్థిక శాఖను కేటాయించగా, కేజీ అరుణ్‌రాజ్‌కు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖను కేటాయించినట్లు రాజ్ భవన్ (లోక్ భవన్) ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే, ఎన్. ఆనంద్‌కు గ్రామీణాభివృద్ధి, జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.
ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో విల్లివాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన మంత్రి ఆధవ్ అర్జున.. పబ్లిక్ వర్క్స్ (PWD), క్రీడలు మరియు అభివృద్ధి శాఖలను నిర్వహించనున్నారు. పి. వెంకటరమణన్‌కు ఆహార, పౌర సరఫరాల శాఖను కేటాయించారు.
ఆర్. నిర్మల్ కుమార్ ఇంధన (విద్యుత్), న్యాయ శాఖలను చూసుకోనుండగా, రాజ్‌మోహన్‌ను పాఠశాల విద్యాశాఖ మంత్రిగా నియమించారు. మరోవైపు, టి.కె. ప్రభుకు సహజ వనరుల శాఖను, ఎస్. కీర్తనకు పరిశ్రమల శాఖను కేటాయించినట్లు అధికారిక ప్రకటన పేర్కొంది.
ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలాన్ని నిరూపించుకోవడానికి నాలుగు రోజుల పాటు తీవ్ర కసరత్తులు చేయాల్సి వచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాల్లో (విజయ్ పోటీ చేసిన రెండు స్థానాలతో కలిపి) విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, మేజిక్ ఫిగర్ 118కి స్వల్ప దూరంలో నిలిచిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, విడుతలై చిరుతైగల్ కట్చి (VCK), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటైంది.
