Monday, 26 Aug, 2.32 am ఆంధ్ర భూమి

ప్రధాన వార్తలు
ఫిరోజ్‌పూర్‌కు వరద ముప్పు

చండీఘ్ఢ్, ఆగస్టు 25: పాకిస్తాన్ సట్లెజ్ నది నుంచి పెద్ద ఎత్తున నీటిని భారత భూభాగంలోకి విడుదల చేయడంతో పంజాబ్ సరిహద్దు జిల్లాలోని ఫెరోజ్‌పూర్ ప్రాంతంలో గల కొన్ని గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సట్లెజ్ నది నుంచి నీటిని ఒక్కసారిగా విడుదల చేయడంతో ఎన్‌క్యాచ్‌మెంట్ పరిధిలో గల గట్టు ప్రాంతంలోని గ్రామాల ప్రజలు ముంపు భయంతో భయాందోళన చెందుతున్నారు. జిల్లా అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..సట్లెజ్ నది నుంచి ఉవ్వెత్తున వరద జలాలు సరిహద్దు ప్రాంతాన్ని ముంచెత్తుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. భారీ ప్రమాదం పొంచివున్న కొన్ని గ్రామాల్లో ముందు జాగ్రత్త చర్యగా ఎన్‌డీఆర్‌ఎఫ్, ఆర్మీ టీమ్‌లను ఏర్పాటు చేశారు. 'సట్లెజ్ నది నుంచి పాకిస్తాన్ పెద్ద ఎత్తున నీటిని విడుదల చేయడంతో తెండివాలా గ్రామానికి ముప్పు పొంచి ఉంది. అదేవిధంగా మరికొన్ని గ్రామాల్లో సైతం ఈ ముప్పు వాటిల్లే అవకాశం ఉంది' అని పంజాబ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు ఆదివారం మీడియాకు తెలిపారు.

వరద ముప్పు తీవ్రంగా ఉన్న సమస్యాత్మ గ్రామాల ప్రజలను తరలించేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా వివిధ గ్రామాల్లో ఆరోగ్య, ఆహార, పౌరసరఫరా అప్రమత్తం చేశామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించామని ఆయన తెలిపారు. భారత్-పాక్ సరిహద్దు ప్రాంతంలోని గ్రామాల్లో వరద ముంపు నుంచి ప్రజలను రక్షించేందుకు ఆర్మీతో సంయుక్తంగా పనిచేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఫిరోజ్‌పూర్, జలంధర్, కపుర్తలా, రూప్‌నగర్ జిల్లాల అధికారులతో వరద పరిస్థితిపై ఉన్నత స్థాయి సమావేశాన్ని ఆయన నిర్వహించారు.

తెండివాలా గ్రామంతోపాటు వరద ముప్పు ఉన్న అన్ని గ్రామాల్లో కూడా సహాయక చర్యలు సత్వరం చేపట్టాలని నీటిపారుదల శాఖను ఆదేశించినట్టు అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. తెండివాలా గ్రామంలో నీటిపారుదల, డ్రైనేజీ విభాగాల అధికారులు వరద దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టేందుకు సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఫిరోజ్‌పూర్ డిప్యూటీ కమిషనర్ ఆదేశించారు. గ్రామాన్ని ఆనుకున్న ఉన్న వరద కట్ట తెగిపోకుండా ఇసుక బస్తాలను పెద్ద ఎత్తున సమకూర్చాలని ఆయన అధికారులకు సూచించారు. ఇదిలావుండగా, పాకిస్తాన్ సట్లెజ్ నది హెడ్‌వర్క్ గేట్లను కొద్దిరోజుల కిందట ఎత్తడంతో ఫిరోజ్‌పూర్ జిల్లాలో దాదాపు 17 గ్రామాలు వరద ముంపును ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇపుడు మళ్లీ సట్లెజ్ నది నుంచి ఒక్కసారిగా నీటిని వదిలిపెట్టడంతో ఆయా గ్రామాల ప్రజల్లో ఆందోళన మరింత తీవ్రమవుతోంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhra Bhoomi
Top