Saturday, 30 Nov, 12.00 am ఆంధ్ర భూమి


గండర గండడు

నటునిగా స్థిరపడిన తరువాత, చిత్ర నిర్మాణం పట్ల ఆసక్తి, మిత్రుల ప్రోత్సాహం, వారి అభిలాష తోడై కాంతారావు తొలుత తన భార్య పేరిట హేమా ఫిలిమ్స్ బ్యానర్ స్థాపించారు. ఆ బ్యానర్‌పై 'సప్తస్వరాలు' సంగీత భరిత చిత్రాన్ని నిర్మించారు. తరువాత హేమా ఫిలిమ్స్‌ను సంజీవిని ఫిలిమ్స్‌గా పేరు మార్చి 1969లో కాంతారావు నిర్మించిన జానపద చిత్రం గండర గండడు. అప్పటికి సహాయ నటి పాత్రలు పోషిస్తోన్న అనితను ఈ చిత్రానికి నాయికగా ఎన్నుకున్నారు. మరో ముఖ్య పాత్రను విజయలలిత పోషించింది. ఈ చిత్రంలో విలన్ రంజిత్ పాత్రకు నటుడు రాజనాలను ప్రత్యేకంగా ఒప్పించారు. అప్పటికే విలన్ పాత్రలతో మంచి పేరు తెచ్చుకున్న రాజనాల, భార్య మరణంతో విచారగ్రస్తులై ఉన్నారు. రాజనాల అంటే కాంతారావుకు అభిమానం ఎక్కువ. అందుకే -'ఈ సమయంలో తిరిగి చిత్రాల్లో నటిస్తేనే మీకు ఊరట కలుగుతుంది. మనసుకు కొంత మార్పువస్తుంది. నటునిగా బిజీగా ఉండటం మంచిది' అని సూచించి.. రంజిత్ పాత్రకు రాజనాలను ఒప్పించారు. ఈ చిత్రానికి దర్శకులు కెఎస్‌ఆర్ దాస్ సారధ్యం వహించారు. వినాయకుని విగ్రహంపై టైటిల్స్ వస్తుంటే, సినిమా మొదలవుతుంది.
కథ: కృష్ణమోహన్
మాటలు: జి కృష్ణమూర్తి (జికె మూర్తి)
సంగీతం: ఎస్‌పి కోదండపాణి
కూర్పు: కోటగిరి గోపాలరావు
నృత్యం: కెఎస్ రెడ్డి
స్టంట్స్: మాధవన్
కళ: బిఎన్ కృష్ణ
ఫొటోగ్రఫీ: అన్నయ్య
దర్శకత్వం: కెఎస్‌ఆర్ దాస్
నిర్మాతలు: జి రామం, వి చంద్రశేఖర్.
*
అలకాపురికి మహారాజు ధూళిపాళ, మహారాణి పుష్పకుమారి. వారి రాజ్యంలోని దేవిని మహారాణి స్వర్ణమాలతో అలంకరించి పూజిస్తుంది. దేవి విగ్రహం ముందు మందసంలో భద్రపర్చబడిన మాలవలన అలకాపురి రాజ్యం సుభిక్షంగా ఉంటుందని ప్రజల నమ్మకం. కాలకంఠుడనే (త్యాగరాజు) మాంత్రికుడు తన గుహలో దేవిని అర్చిస్తుంటాడు. ఆమె ప్రసన్నం కాదు. దాంతో తల ఖండించుకోబోతాడు. మాత అనుగ్రహం, మోక్షం పొందాలంటే అలకాపురిలోవున్న స్వర్ణమాలతో దేవిని అలంకరించి, పున్నమి రోజున ఐదుగురు రాచకన్యలను దేవికి బలివ్వాలని గుహలోని అస్తిపంజరాలు పలుకుతాయి. అయితే, స్వర్ణమాల సాధన అంత సులువుకాదని, అలకాపురి యువరాజు మనోహరుడు గొప్పవీరుడని, అష్టసిద్ధులు సాధించినవాడని చెబుతాయి. అలకాపురిలో నిర్వహించే వసంతోత్సవానికి పలు దేశాల రాచకన్యలు వచ్చారని తెలిసికొన్న కాలకంఠుడు, వారితోపాటు స్వర్ణమాలను సంగ్రహించాలని బయలుదేరుతాడు. కళింగదేశపు ప్రభువు (కాశీనాథ్ తాత) కుమార్తె శశిరేఖ (అనిత), మేనత్త కుమారుడైన మనోహరుడిపై ప్రేమ పెంచుకుంటుంది. శశిరేఖకు బావ వరసైన రంజిత్ (రాజనాల) శశిరేఖను ప్రేమించినా, ఆమె తండ్రి మనోహరుడివైపే మొగ్గుచూపుతాడు. దీంతో మనోహరునిపై రంజిత్ ద్వేషం పెంచుకుంటాడు. రాజ్యసభలో కత్తియుద్ధంలో రంజిత్‌ను ఓడించిన మనోహరుడు (కాంతారావు) గండరగండడు బిరుదు పొందుతాడు. అదే సభలో నృత్యం చేసిన రాజనర్తకి మంజరి (విజయలలిత) రాకుమారినిపై ప్రేమ ప్రదర్శించి తిరస్కారానికి గురవుతుంది. ఆ కోపంతో రంజిత్, మహామంత్రి (మిక్కిలినేని)తో చేతులుకలిపి యువరాజు అంతానికి కుట్రపన్నుతారు. వసంతోత్సవంలో కన్యలను, దేవి ఆలయంలో స్వర్ణమాలను కాలకంఠుడు మాయంచేసి తన గుహకు చేరుస్తాడు. నిందల ఎదుర్కొన్న అలకాపురి రాజదంపతులు చెరసాల పాలవుతారు. రాజకన్యలు, స్వర్ణమాలను తిరిగి తేవటానికి మనోహరుడు బయలుదేరతాడు. దారిలో పలు అడ్డంకులు అధిగమించి దైవానుగ్రహంతో స్వర్ణమాలను సాధించి, రాకుమార్తెలను అలకాపురికి తెస్తాడు. అనంతరం శశిరేఖను పరిణయమాడి తల్లిదండ్రులతో కలిసి దేవిని అర్చించటంతో చిత్రం ముగుస్తుంది.
చిత్రంలో మనోహరుని మిత్రునిగా మోదుకూరి సత్యం, అతనికి జోడీగా సురేఖ, కోయదొరగా రావుగోపాలరావు, మాంత్రికుని శిష్యులుగా గణేష్, కెకె శర్మ, భవిషత్, వర్తమాన సూచనలిచ్చే వ్యక్తిగా డాక్టర్ రమేష్, ఇంకా రామచంద్రరావు, లక్ష్మీకాంతమ్మ, కోళ్ల సత్యం, మంత్రి కుమార్తెగా శకుంతల, జ్యోతిలక్ష్మి నటించారు. శకుంతలపై చిత్రీకరించిన నాగ నృత్యం గీతం -నవ్వనా కెవ్వున రవ్వలే రువ్వనా (రచన: రాజశ్రీ, గానం: విజయలక్ష్మీ కన్నారావు). నాగనృత్యం గీతంలో శంకుతల ఇచ్చిన వివిధ నాగ భంగిమలతో అలరించేలా చిత్రీకరించారు. జల రక్కసిగా జ్యోతిలక్ష్మిపై చిత్రీకరించిన కవ్వించే గీతం -వనె్నలాడి వలచింది కన్ను గీటి పిలిచింది నినే్నరా (గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి, రచన: జికె మూర్తి). ఈ గీతాన్ని పలు సెట్టింగ్స్‌తో ఆకట్టుకునేలా జ్యోతిలక్ష్మి మార్కు నృత్యంతో చిత్రీకరించారు.
దేవిని ప్రార్థిస్తూ మహారాణి ఆలపించే లక్ష్మీస్తుతి -నమామి ధర్మ నిలయం. సంప్రదాయ శ్లోకంగా విజయలక్ష్మీ కన్నారావు ఆలపించారు. ఆ వెంటనే మహారాణి కోరినట్టు నన్ను అనుగ్రహించు తల్లీ అని త్యాగరాజు అనడం, దానికి అస్తిపంజరాల రియాక్షన్ అద్భుతంగా చిత్రీకరించారు. జానపద కథా చిత్రాలకు తగ్గట్టు ఒకదానివెంట మరొకటి సన్నివేశాలను వేగంగా, అర్ధవంతంగా తీర్చిదిద్దటం దర్శకుని ప్రతిభకు అద్దం పడుతుంది. మంజరి సభలో నృత్యగీతం -అసమాన రసికావతంస నల్లెశల వ్యాపించే నీ కీర్తికలహంస (గానం: పి సుశీల, రచన: సినారె) అలరించేలా సాగటం, యువరాజు ఇచ్చిన హారంచూసి అతనిపై మరులుకొనటం, సభలో కనికట్టు, సభాసమ్మోహనం ప్రదర్శించిన యువరాజే కన్యలను మాయం చేశాడన్న అభియోగం, రాకుమార్తెలకై వెళ్లిన యువరాజును రంజిత్ వెంబడించగా కొండ చీలి పాతాళంలో పడటం, కత్తుల బోనునుంచి తప్పించుకున్న శశిరేఖ ఆపద్బాంధవుడనే వ్యక్తిసాయంతో మనోహరుని రక్షించుకోవటం, తిరిగి ఆమె ఆపదలోపడటం, పెళ్లయినా సంసారం చేయని యువరాజు స్నేహితుడు వైకుంఠం, అతని భార్యల నీడపడి కాలకంఠుని గుహమార్గం తెరచుకోవటం, కోయదొర రాజదంపతులను రక్షించి తనవద్ద భద్రంగా ఉంచిత, మాంత్రికుడు వారిని రప్పించి.. మహారాణిచే మందసం తెరిపించే యత్నం చేయటం, మహారాజును బాధించడం.. ఇలా పలువిధాలుగా కథను పరుగుపెట్టించి దర్శకుడు సినిమాపై ఆసక్తి పెంచాడు. ఇక టైటిల్స్‌లో కాంతారావు, రాజనాల ఇద్దరి పేర్లూ మొదటగా చూపటం, అలాగే చిత్రంలో వారిరువురి నాలుగుసార్లు అద్భుతమైన పోరాటాలను థ్రిల్లింగ్‌గా చిత్రీకరించి సినిమాను రక్తికట్టించారు. రాజనాల, కాంతారావు ఇద్దరూ తమ పాత్రలను సమర్ధంగా పోషించారు. భార్యా వియోగ విచారాన్ని పక్కనపెట్టి, అభిమానంతో కాంతారావు కల్పించిన అవకాశాన్ని రాజనాల ఉపయోగించుకుని చిత్రాల్లో బిజీ అయ్యారు. ఎస్‌పి కోదండపాణి కట్టిన బాణీలతో పాటలు అలరించేలా సాగాయి. వైకుంఠం, అతని చెలిపై గీతం -లేనిపోని సాకుచెప్పి (గానం: విజయలక్ష్మీ కన్నారావు, పిఠాపురం; రచన- జికె మూర్తి). కాంతారావు, అనితలపై చల్లని వెనె్నలలో తోటలో చిత్రీకరించిన గీతం -మనసులోన వౌనవీణ/ మధుర గీతం పాడనీ (గానం: ఎస్‌పి బాలు, ఎస్ జానకి; రచన: సినారె).
గండర గండడు చక్కని మంచి కాలక్షేప చిత్రంగా ప్రేక్షకాదరణ పొందింది. అలరించే కత్తియుద్ధాలు, కుతంత్రాలవల్ల ప్రాణాలు పోగొట్టుకున్న మాంత్రికుడు, మంజుల, శకుంతల పాత్రలు చిత్రంలో ఆకట్టుకునేలా తీర్చిదిద్దటం కొందరికి మార్గదర్శకం.
చిత్రాన్ని 'అపరాజిత ఫిలింస్' పంపిణీ సంస్థ అధినేత మార్వాడి సేటు కొనడంతో హీరో కాంతారావుకి మంచి లాభాలే వచ్చాయి. అదే ఆశ భావనలతో తిరిగి సంజీవని ఫిలిమ్స్ బ్యానర్‌పై 1971లో ప్రేమజీవులు నిర్మించి.. అది విజయం సాధించక నష్టాలు చవిచూశారు. అదంతా విధి విలాసం అనుకోవాలి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhra Bhoomi
Top