Sunday, 12 Aug, 12.28 pm ఆంధ్రప్రదేశ్

విశాఖసిటీ
జ్ఞాన బడి.. గ్రంథాలయ ఒడి

- జిల్లాలో ప్రసిద్ధికెక్కిన విజ్ఞాన వీచికలెన్నో..
- సౌకర్యాలు కల్పిస్తే ఫలితాలు అమోఘం
- నేడు గ్రంథాలయ దినోత్సవం
ప్రజాశక్తి-కలెక్టరేట్‌
మనిషిని సంస్కారవంతునిగా నిలపడంలో గ్రంథాలయాల పాత్ర విశిష్టమైనది. సమూహంలో ఉంటూనే ఏకాంతాన్ని అనుభవించగలిగే అతిసుందర ప్రదేశం ఇదొక్కటేనంటే అతిశయోక్తి కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇక్కడ తవ్వుకోగలిగినన్ని జ్ఞానగనులు ఉంటాయి. కూర్చునే ప్రపంచాన్ని చుట్టిరాగలిగినన్ని వాహనాలు కనిపిస్తాయి. అందుకే 'విజ్ఞాన వీచికలు.. గ్రంథాలయాలు' అని అంటారు. ప్రతిఏటా ఆగస్టు 12న గ్రంథాలయ దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో అసలింతకీ ఈ రోజు ప్రత్యేకతేంటి ? జిల్లాలో ఉన్న గ్రంథాలయాల స్థితిగతులేంటి ? అన్న విషయాలను తెలియజేస్తూ సాగేదే ఈ కథనం.
మనిషికి పుస్తకాలతో విడదీయరాని అవినాభావ సంబంధం ఉంది. సమాచార, సాంకేతిక విప్లవం రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతూ రేడియో, టెలివిజన్‌, ఇంటర్నెట్‌ వంటి ఆధునిక సమాచార సాధనాలు ఎన్ని వచ్చినా పుస్తకాలకు ప్రాధాన్యం ఎప్పటికీ చెక్కు చెదరకపోవడం విశేషం. మనకు తెలియని ఎన్నో విషయాలను పుస్తక పఠనం ద్వారా తెలుసుకోవచ్చు. అటువంటి పుస్తకాలకు నిలయాలే గ్రంథాలయాలు. నేడు మారుమూల పల్లెల్లో కూడా గ్రంథాలయాలు సాహితీ సౌరభాలు గుభాళిస్తూనే ఉన్నాయి. ప్రతి ఏటా దసరా, వేసవి సెలవుల్లో గ్రంథాలయాలు విద్యార్థులు, యువతీ, యువకుల మేధో వికాసానికి విశేష కృషి చేస్తున్నాయి. చిత్రలేఖనం, నృత్యం, ఆటలు, పాటల పోటీలు పెడుతూ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వారి దృష్టిని గ్రంథాలయాల వైపునకు మరలుస్తున్నాయి.
ఈ రోజు ప్రత్యేకత ఏంటి ?
భారతీయ గ్రంథాలయ పితామహునిగా ప్రసిద్ధిగాంచిన పద్మశ్రీ డాక్టర్‌ ఎస్‌ఆర్‌.రంగనాథన్‌ జయంతిని ఏటా కేంద్ర ప్రభుత్వం గ్రంథాలయ దినోత్సవంగా జరుపుకుంటోంది. ఆయన 1892 ఆగస్టు 12వ తేదీన తమిళనాడులో జన్మించారు. గ్రంథాలయ వ్యవస్థ వికాసానికి విశేషంగా కృషి చేసిన ఆయన జయంతిని జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా ప్రకటించి ఘనంగా నిర్వహించడం జాతికి గర్వకారణం. ఆయన రాయని గ్రంథం లేదు. చేయని పరిశోధన లేదు. నిత్య విద్యార్థిగా, నిరంతర అన్వేషిగా పేరుగాంచిన రంగనాథన్‌ గ్రంథాలయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారు. పుస్తకాలపై అభిమానం, గ్రంథాలపై ఆసక్తి ఉండటంతో పరిశోధనల వైపు అడుగు వేశారు. భావితరాలకు అవసరమైన ఎన్నో గ్రంథాలు, ప్రణాళికలు అందించారు. ప్రస్తుత గ్రంథాలయ విజ్ఞానం ఒక విధానంగా, శాస్త్రంగా అభివృద్ధి చెందిందంటే ఆయన చలవేనని చెప్పవచ్చు. భారత దేశంలో అకడమిక్‌ లైబ్రరీలతో పాటు, పబ్లిక్‌ లైబ్రరీలలో అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. మద్రాసు యూనివర్సిటీలో రంగనాథన్‌ గ్రంథాలయ అధికారిగా పని చేసినప్పుడు పబ్లిక్‌ లైబ్రరీ సిస్టమ్‌ను చట్టంగా తీసుకు వచ్చేందుకు కృషి సలిపి సఫలీకృతులయ్యారు. ఆయన సూచించిన 'ఫైవ్‌లాస్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్‌' ఇప్పటికే మార్గదర్శకాలుగా నిలవడం విశేషం. ఆయన రూపొందించిన 'కాలమ్‌ క్లాసిఫికేషన్‌ స్కీమ్‌' ప్రపంచ వ్యాపితంగా ప్రసిద్ధిగాంచింది.
కోలస్‌ క్లాసిఫికేషన్‌ అంటే..
డాక్టర్‌ ఎస్‌ఆర్‌.రంగనాథన్‌ గ్రంథాలయ వ్యవస్థకు సంబంధించిన ప్రపంచవ్యాప్త ధోరణులను పరిశీలించి, విశేష అనుభవం గడించి, గ్రంథాలయ కేటలాగులను తయారు చేయడానికి ఒక కొత్త కోడ్‌ను 1933లో రూపొందించారు. కోలన్‌ క్లాసిఫికేషన్‌ అని పిలిచే ఈ వర్గీకరణ సూత్రాన్ని దేశంలోని చాలా గ్రంథాలయాలు అనుసరిస్తున్నాయి. పుస్తకం వ్యక్తిత్వం, విషయం, శక్తి, నిడివి, సమయం అనే ఐదు ప్రాథమిక సూత్రాల ఆధారంగా కోలన్‌ క్లాసిఫికేషన్‌ రూపకల్పన జరిగింది. నానా రకాల పుస్తకాలను ఎలా అమర్చాలి ? అన్నదానిపై అధ్యయనం చేసి సంకేతాలు ఇచ్చారు రంగనాథన్‌. ఉదాహరణకు సాహిత్య పుస్తకాలను 'ఒ'తో సూచించారు. ధార్మిక పుస్తకాలను 'క్యూ'తో, వైద్యానికి సంబంధించినవి 'ఎల్‌'తో, అగ్రికల్చర్‌ను 'జె'తో ఇందులో మళ్లీ హార్టికల్చర్‌ను 'జె1'తో.. ఇలా గ్రూప్సు, సబ్‌ గ్రూప్సు విభజనతో పుస్తకాన్ని ఎక్కడున్నా గాలించి పట్టుకునే కోడ్‌ సష్టించారు. అందుకే ఆయన్ని పఠన ప్రియులెవరూ ఎప్పటికీ మరువలేరు.
ఎన్నో అవార్డులు సొంతం
ఆయన అందించిన సేవలకు పద్మశ్రీ, రాహుసాహెబ్‌, నేషనల్‌ ప్రొఫెసర్‌ వంటి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. 1957లో గ్రంథాలయాలపై యుజిసి నియమించిన కమిటీ, జాతీయ అంతర్జాతీయ గ్రంథాలయ, పరిశోధనా సంస్థలకు రంగనాథన్‌ సారథ్యం వహించారు. న్యూఢిల్లీలోని ఇన్స్‌డాక్‌, బెంగుళూరులోని డిఆర్‌టిసి వంటి గ్రంథాలయ పరిశోధనా కేంద్రాలు ఆయన కన్న కలలకు ప్రతి రూపాలుగా చెప్పుకోవచ్చు. రంగనాథన్‌ 60కి పైగా గ్రంథాలు, వెయ్యికి పైగా రచనలను అందించారు. పబ్లిక్‌ లైబ్రరీ సిస్టమ్‌పై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు ఆయన జీవితంలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. 1972 సెప్టెంబర్‌ 27న ఆయన కన్నుమూశారు.
జిల్లాలో లైబ్రేరియన్లు కరువు
జిల్లాలో 64 ప్రభుత్వ గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో అత్యధికం రికార్డు అసిస్టెంట్లు, అటెండర్లతోనే నడుస్తున్నాయి. పదేళ్లుగా అనేక మంది లైబ్రేరియన్లు ఉద్యోగ విరమణ చేయడంతో వాటిని ప్రభుత్వం భర్తీ చేయలేదు. గ్రేడ్‌ - 3లో 41, గ్రేడ్‌ - 2లో 8, గ్రేడ్‌ వన్‌లో ఆరుగురు లైబ్రేరియన్లు పోస్టులు ఉన్నాయి. వాటిని సరిగా భర్తీ చేయకపోవడంతో రికార్డు అసిస్టెంట్లు, అటెండర్లే అన్ని పనులూ చూసుకుంటున్నారు. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇదే జిల్లాలో నివసిస్తున్నారు. ఆయన గ్రంథాలయాల అభివృద్ధికి ఏమీ చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లైబ్రరీల నిర్వహణలో లైబ్రేరియన్లు ఎంతో కీలకం. గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను భద్రంగా చూడటంతో పాటు, వాటిని క్రమ పద్ధతిలో ఉంచి, కావాల్సిన పుస్తకాన్ని క్షణాల్లో తీసుకునేలా ఏర్పాటు చేస్తారు. తరగతుల వారీగా పుస్తకాలను సెల్ఫ్‌లలో ఉంచుతారు. చందాదారులకు కావాల్సిన పుస్తకాలను డెలివరీ చేయడంతోపాటు గ్రంథాలయానికి సంబంధించిన అన్ని రికార్డులు నిర్వహిస్తుంటారు. ఇంత కీలకమైన లైబ్రేరియన్లు లేకుండా ప్రభుత్వ గ్రంథాలయాలు నడుస్తుండటం శోచనీయం. జిల్లాలో పలు ప్రభుత్వ గ్రంథాలయాలకు సొంత భవనాలు లేవు. కొన్నింటికి సొంత భవనాలున్నప్పటికీ శిథిలావస్థలో ఉన్నాయి. ఆఖరికి జిల్లా కేంద్రమైన విశాఖపట్నంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయం కూడా అద్దె భవనంలోనే నడుస్తోంది. జగదాంబ జంక్షన్‌ సమీపంలో ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థ స్థల వివాదం నాలుగేళ్లుగా సాగుతోంది. ఇక్కడి గ్రంథాలయాన్ని వి-మాక్స్‌, శ్రీ మెలోడీ థియేటర్స్‌ ప్రాంతానికి తరలించారు. అది కూడా అద్దె భవనంలో నడుస్తోంది.
ప్రసిద్ధిగాంచిన పబ్లిక్‌, విఎస్‌.కృష్ణా లైబ్రరీలు
విశాఖ నగరంలోని పబ్లిక్‌ లైబ్రరీ, ఎయులోని విఎస్‌.కృష్ణా లైబ్రరీ రాష్ట్రంలోనే పేరుగాంచినవి. ఇక్కడ వేలాది పుస్తకాలు కొలువుదీరాయి. పబ్లిక్‌ లైబ్రరీని ఇటీవల ఆధునికీకరించారు. ఆన్‌లైన్‌ పుస్తక సేవలు అందుతున్నాయి. విద్యార్థులు కూర్చుని చదువుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో నెగ్గుతున్న అత్యధిక మంది ఈ లైబ్రరీలో పుస్తకాలను ఉపయోగించుకున్నవారే. ఇవే కాకుండా అనకాపల్లిలోని గౌరీ, శారదా గ్రంథాలయాలు కూడా పేరెన్నికగన్నవే.
నగరంలో పిల్లల గ్రంథాలయం నెలకొల్పాలి
జిల్లాలో గ్రంథాలయాల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. అనేక గ్రంథాలయాలకు లైబ్రేరియన్లు లేరు. పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక గ్రంథాలయాన్ని నగరంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. జిల్లా గ్రంథాలయ సంస్థకు ఎన్ని నిధులు ఉన్నాయి ? ఇంకా ఎన్ని స్థానిక సంస్థల నుంచి రావాల్సి ఉంది ? అన్న విషయాలను చెప్పాలి. రాష్ట్రం అభివృద్ధి చెందడం అంటే విజ్ఞానం అభివృద్ధి చెందడం అని భావిస్తాను. మరి విజ్ఞానం అభివృద్ధి చెందాలంటే గ్రంథాలయాలు సమర్థవంతంగా నడవాలి కదా. జివిఎంసి నాలుగు సంవత్సరాలుగా జిల్లా గ్రంథాలయ సంస్థకు సుమారు కోటి రూపాయల వరకు బకాయి పడింది. దానిని ఎందుకు చెల్లించరు ? ఎమ్మెల్యేలు దీనిని ఎందుకు ప్రశ్నించరు ?. ఈ విషయాలను ప్రజలు అవగతం చేసుకుని ఉద్యమించాలి.
నరవ ప్రకాశరావు, బాల వికాస్‌ ఫౌండేషన్‌ కార్యదర్శి

గ్రంథాలయ సేవకే జీవితం అంకితం
20 ఏళ్ల నుంచి గ్రంథాలయాధికారిగా పనిచేస్తున్నాను. నక్కపల్లి, ఉపమాక, చినదొడ్డిగల్లు గ్రంథాలయాల్లో గ్రంథాలయాధికారి విధులు నిర్వహిస్తున్నాను. పనిభారం, అధికారుల ఒత్తిడితో పనిచేస్తున్నప్పటికీ, పాఠకులు ఇచ్చిన అభిమానం మరువలేనిది. గ్రంథాలయానికి వచ్చిన పాఠకులతో ఎంతో స్నేహభావంగా ఉంటాను. పాఠకులకు నచ్చిన పుస్తకాలు అందిస్తాను. గ్రంథాలయంలో వివిధ పుస్తకాలు సేకరించేందుకు దాతల సహాయ, సహాకారాలు తీసుకుంటాను. వృత్తిని సేవగా భావిస్తాను. గ్రంథాలయం అభివృద్ధికి అహర్నిశలూ కృషిచేస్తాను. పాఠకుల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాను. ఎక్కువ సంఖ్యలో పాఠకులు, విద్యార్థుల సభ్యత్వాలు నమోదు చేశాం.
- కలగాన జనార్థనరావు, గ్రంథాలయాధికారి, నక్కపల్లి.

గ్రంథ పాలకులు సేవలు అమోఘం
గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలుగా నేటికీ చెక్కుచెదరని ఆదరణతో భాసిల్లుతున్నాయి. దీనికి గ్రంథపాలకులు సేవలే కారణం. విద్యార్థులు జీవితంలో ఎదగాలంటే పుస్తక పఠనం తప్పనిసరి. ఎంతటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా పుస్తకం ప్రాధాన్యత తగ్గలేదు. ఆ విజ్ఞాన భాండాగారాలను మరింతగా విస్తరించిన నాడే సమాజానికి మేలు చేకూరుతుంది.
- ఎన్‌.దేముడు, రిటైర్డ్‌ లెక్చరర్‌, చోడవరం.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhra Pradesh
Top