గుడివాడ: ఆక్వా ఉత్పత్తుల ధరలను ఏప్రిల్ 14 వరకు స్థిరంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పేర్కొన్నారు. ఆదివారం గుడివాడలో పలువురు ఆక్వా రైతులు ఆయన్ను కలసి రొయ్యల పట్టుబడి, ఎగుమతి సమస్యలను వివరించారు. రొయ్యలు ఎగుమతి చేసే గ్రోవెల్ సంస్థ అధినేత చింతపల్లి సుధీర్‌తో మంత్రి ఫోన్లో మాట్లాడారు. రొయ్యల ఎగుమతికి అవసరమైన వాహనాలను పంపాలని కోరారు. మార్కెట్‌లో ఆక్వా ఉత్పత్తుల ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ దేశంలోనే తొలిసారిగా ఏపీలో స్థిరమైన ధరలు నిర్ణయించామని నాని తెలిపారు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు ఆగకుండా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు.
