Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
2 నిమిషాల్లో పక్షవాతం నిర్ధారణ

2 నిమిషాల్లో పక్షవాతం నిర్ధారణ

కృత్రిమ మేధ వినియోగంతో సాధ్యం

దేశంలో తొలిసారిగా అపోలోలో!

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): కృత్రిమే మేధ (ఏఐ-ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) వినియోగం ద్వారా.. కేవలం రెండు నిమిషాల్లో పక్షవాతాన్ని నిర్ధారించే సౌకర్యాన్ని అపోలో ఆస్పత్రి అందుబాటులోకి తెచ్చింది. స్ట్రోక్‌తో వచ్చిన రోగికి వైద్యం అందడంలో ఆలస్యాన్ని నివారించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. దేశంలోనే మొట్టమొదటిదైన ఈ అధునాతన విధానం అమలుకు గురువారం వర్చువల్‌ సమావేశంలో ఇండియా మెడ్‌ట్రానిక్‌ సంస్థతో అపోలో ఆస్పత్రి భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులోభాగంగా మెడ్‌ట్రానిక్‌ సంస్థ సాంకేతిక, శిక్షణ సహకారం అందించనుంది.

కాగా, సిటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ స్కాన్‌ ఫలితాల కోసం నిరీక్షించాల్సి ఉండటంతో పక్షవాతం నిర్ధారణకు ప్రస్తుతం గంట సమయం పడుతోంది. ఏఐ వినియోగంతో నేరుగా ఎంఆర్‌ఐ ఫిల్మ్‌ చూస్తూనే ఫలితం చెప్పేసే వీలుంది. వైద్యుడు అందుబాటులో లేకున్నా.. ఎలాంటి చికిత్స అందించవచ్చో ఆస్పత్రి ఇతర వైద్యులు చెప్పే అవకాశముంది.

దేశంలో ఏటా 18 లక్షల మందికి వ్యాధి

దేశంలో ఏటా సుమారు18 లక్షల మంది పక్షవాతానికి గురవుతున్నారని అపోలో ఆస్పత్రుల గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి రెడ్డి అన్నారు. మెడ్‌ట్రానిక్‌తో ఒప్పందం సందర్భంగా ఆయన మాట్లాడారు. 25 ఏళ్లు దాటిన ప్రతి నలుగురిలో ఒకరు స్ట్రోక్‌కు గురవుతున్నారని వరల్డ్‌ స్ట్రోక్‌ ఆర్గనైజేషన్‌ నివేదించిందని తెలిపారు. దేశంలో మరణాలకు దారితీసే నాలుగో అతి పెద్ద కారణం పక్షవాతమని అన్నారు. ఆరోగ్య సంరక్షణలో గొప్ప మార్పు తీసుకొచ్చిన కృత్రిమే మేధను వరంగా పేర్కొన్నారు. దీంతో వైద్యులు రోగులకు ఎక్కువ సమయం కేటాయించడం సాధ్యం అవుతోందన్నారు. ఏఐ ఆధారిత సీటీ, ఎంఆర్‌ఐ స్కాన్‌ల ఆధారంగా చికిత్స అందిస్తే.. 6 నుంచి 24 గంటల్లో రోగి ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుందని అపోలో ఆస్పత్రుల గ్రూప్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ ప్రీతిరెడ్డి వివరించారు. కార్యక్రమంలో మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీతారెడ్డి పాల్గొన్నారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy