Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
22న సీఎం అరకులోయ రాక

22న సీఎం అరకులోయ రాక

- సంజీవని పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించనున్న చంద్రబాబునాయుడు

- ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

పాడేరు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 22న అరకులోయ రానున్నారు.

అరకులోయ మండలంలోని సుంకరమెట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమలు చేసే 'సంజీవని' పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సీఎం వస్తున్నందున ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో సంజీవని పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి వస్తున్నందున ఆరోగ్య సేవల డిజిటల్‌ నమోదు, వైద్య శిబిరాలు, అంబులెన్సులు, షామియాలు వంటివి ముందస్తుగానే సిద్ధం చేయాలన్నారు. సీఎం పర్యటనలో భద్రత, ప్రొటోకాల్‌, హెలీప్యాడ్‌, కాన్వాయ్‌ మార్గాలు, సభా ప్రాంగణం, మీడియా గ్యాలరీ, ప్రజా సౌకర్యాలు, తదితర ఏర్పాట్లను వివిధ శాఖల సమన్వయంతో చేపట్టాలన్నారు. ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా చర్యలు చేపట్టాలని, ఈ క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు చేపడతామని ఆమె హెచ్చరించారు.

స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు

జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ ఆదేశించారు. వేదిక మైదానం పరిశుభ్రత, పరేడ్‌, సాంస్కృతిక ప్రదర్శనలు, అవార్డుల ప్రదానం, ఇతర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ మాట్లాడుతూ ఈ నెల 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధం కావాలన్నారు. గిరిజన సంప్రదాయాలు, కళలు, వారసత్వ ప్రదర్శనలు, సంస్కృతిని ప్రతిబింబించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై స్టాల్స్‌ ఏర్పాటు, ఇతర అంశాలపైనా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్‌పీ వై.శృతి, జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్‌.లోకేశ్వరరావు, ఆర్‌డీవో ఎం.భుజంగరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy