21న వెంకటపాలెంలో రాష్ట్రస్థాయి కార్యక్రమం
గుంటూరు, జూన్ 6(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21న అమరావతిలోని వెంకటపాలెం టోల్ ప్లాజా సమీప వెస్ట్ బైపాస్ వద్ద రాష్ట్ర స్థాయి సామూహిక యోగా కార్యక్రమం నిర్వహణకు భారీ ఏర్పాట్ల చేస్తోంది.
'యోగాంధ్ర-2026' పేరిట నిర్వహించే ఈ కార్యక్రమంలో 25 వేల మంది ప్రజలను భాగస్వాములను చేయనుంది. ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ జి.వీర పాండియన్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, గుంటూరు జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఇతర అధికారులు ప్రతిపాదిత యోగా వేదికను క్షుణ్ణంగా పరిశీలించారు. యోగా దినోత్సవానికి హాజరయ్యే ప్రజలు, విద్యార్థులు, యోగా సాధకులు, వివిధ శాఖల ప్రతినిధులకు అవసరమైన సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు.
వేదిక నిర్మాణంతోపాటు.. పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, వైద్య సేవలు, అత్యవసర సహాయక చర్యలు, ప్రజల రాకపోకల నిర్వహణపై సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొననున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై కూడా సమీక్ష జరిపారు. అన్ని సౌకర్యాలతో ఏర్పాట్లు సకాలంలో పూర్తి కావాలని అధికారులకు సూచించారు.

