Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
45వ పడిలోకి 'తలా'.. ప్రపంచకప్ వేదికగా ఫిఫా వినూత్న శుభాకాంక్షలు!

45వ పడిలోకి 'తలా'.. ప్రపంచకప్ వేదికగా ఫిఫా వినూత్న శుభాకాంక్షలు!

స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్, ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ ఫినిషర్‌గా పేరుగాంచిన మహేంద్ర సింగ్ ధోనీ మంగళవారం తన 45వ పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకున్నారు.

ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా 'మహీ'కి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈ వేడుకల్లో భాగంగా అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య(FIFA) చేసిన ఓ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం జరుగుతున్నఫిఫా ప్రపంచకప్‌ 2026 టోర్నీలో చెరో 7 గోల్స్ చేసిన స్టార్ ఫుట్‌బాలర్లు లియోనెల్ మెస్సి, కిలియన్ ఎంబాపె, ఎర్లింగ్ హాలాండ్‌ల ఫొటోలను ఫిఫా వరల్డ్ కప్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. దానికి '7 గోల్స్.. తలా ఫర్ ఎ రీజన్.. హ్యాపీ తలా డే' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ధోనీ జెర్సీ నంబర్ '7' తో పాటు, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు అతడిని ప్రేమగా పిలుచుకునే 'తలా' అనే పేరును ప్రస్తావిస్తూ ఫిఫా ఇచ్చిన ఈ ట్రిబ్యూట్ క్రీడాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ధోనీతో ఉన్న ఫొటోను ఎక్స్‌లో పంచుకుంటూ.. 'భారత క్రికెట్‌కు నిజమైన ఐకాన్ అయిన ఎంఎస్ ధోనీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చే నీ నాయకత్వ పటిమ, వారసత్వం ఇలాగే కొనసాగాలి' అని ఆకాంక్షించారు. మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయానికి సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ.. 'ఒత్తిడిలోనూ నువ్వు ప్రదర్శించే ప్రశాంతత, ఆటను నడిపించే తీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో క్రికెటర్లకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది' అని కొనియాడాడు.

మాజీ బ్యాటర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. 'కొంతమంది ఆటగాళ్లు మ్యాచ్‌లు గెలుస్తారు, మరికొందరు ట్రోఫీలు గెలుస్తారు.. కానీ ఎంఎస్ ధోనీ మాత్రం ఒక శకాన్నే గెలిచాడు. హ్యాపీ బర్త్‌డే మహీ' అంటూ ధోనీ క్రేజ్‌ను అద్భుతంగా వర్ణించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా, ధోనీ బ్రాండ్ వాల్యూ, క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ వేడుకలు నిరూపించాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy