Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
5,000 స్కూళ్లు స్మార్ట్‌!

5,000 స్కూళ్లు స్మార్ట్‌!

  • ఇంటరాక్టివ్‌ ప్యానెల్స్‌, కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, నెట్‌ అనుసంధానంతో బోధన

  • 2 వేల బడుల్లో సైన్స్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌లు

  • రూ.300 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టు

  • నిధుల కోసం నాబార్డుకు ప్రతిపాదన

  • 15 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల

  • విద్యార్థులకు ప్రయోజనం

హైదరాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు రూ.300 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 5వేల పాఠశాలల్లో డిజిటల్‌ విద్యా సదుపాయాలు, భవనాలు, ప్రయోగశాలలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో రెండేళ్లలో ప్రాజెక్టు చేపట్టేలా విద్యాశాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ఇందుకోసం నాబార్డు గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి (ఆర్‌ఐడీఎఫ్‌) కింద నిధులను సమీకరించాలని నిర్ణయించింది. ప్రాజెక్టులో ప్రధానంగా స్మార్ట్‌ తరగతి గదులు, డిజిటల్‌ మౌలిక వసతుల కల్పనకు రూ.150 కోట్లు అవసరమని విద్యాశాఖ ప్రతిపాదనల్లో పేర్కొంది.

5 వేల పాఠశాలల్లో ఇంటరాక్టివ్‌ ప్యానెల్స్‌, ప్రొజెక్టర్లు, కంప్యూటర్లు, యూపీఎస్‌, ఇంటర్నెట్‌ సదుపాయాలను ఏర్పాటు చేయాలని, ఆధార్‌ కిట్లను కూడా అందుబాటులో ఉంచాలని తెలిపింది. రాష్ట్రంలోని వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో.. పాఠశాల భవనాలు, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు, ప్రహరీ గోడల నిర్మాణం తదితర సివిల్‌ పనులకు రూ.80 కోట్లు అవసరమని తెలిపింది. ఇక విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానం, కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని పెంచేందుకు 2వేల పాఠశాలల్లో రూ.40 కోట్లతో సైన్స్‌, కంప్యూటర్‌ ప్రయోగశాలలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. వీటికి సంబంధించి ఉపాధ్యాయులకు శిక్షణ, డిజిటల్‌ కంటెంట్‌ రూపకల్పన కోసం రూ.15 కోట్లు అవసరమని పేర్కొంది. తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో విద్యా కంటెంట్‌ను అభివృద్థి చేయడంతోపాటు ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంచేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించింది.

రూ.300 కోట్ల ఈ ప్రాజెక్టును 24 నెలల్లో, మూడు దశల్లో పూర్తి చేయాలని విద్యాశాఖ ప్రతిపాదనల్లో పేర్కొంది. తొలిదశలో 6నెలల్లో పాఠశాలల సర్వే, అవసరాల గుర్తింపు, కొనుగోళ్లు, 500 పాఠశాలల్లో పైలట్‌ ప్రాజెక్టు.. తర్వాత రెండో దశ కింద ఏడాదిలో 4వేల పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మూడో దశలో మిగతా 500పాఠశాలల్లో పనులు, ఉపాధ్యాయ శిక్షణ ఉంటాయని తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ విద్యా సదుపాయాలు, మెరుగైన భౌతిక వసతులు, ప్రయోగశాలల ఏర్పాటు ద్వారా విద్యార్థుల అభ్యసన ఫలితాలను, డిజిటల్‌ అక్షరాస్యతను మెరుగుపర్చడం గ్రామీణ-పట్టణ విద్యా అంతరాలను తగ్గించడం, హాజరును పెంచడం ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేసింది. మొత్తంగా రూ.300 కోట్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను నాబార్డు ఆర్‌ఐడీఎఫ్‌ నిధుల సమీకరణ కోసం పంపారు. నాబార్డు నుంచి అనుమతి రాగానే ప్రాజెక్టు ప్రారంభిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఈ వార్తలనూ చదవండి:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy