సూక్ష్మ ప్రణాళికలకు రూపకల్పన
సీఆర్‌జెడ్‌కు అనుగుణంగా ప్రాజెక్టు పూర్తి
విశాఖ బే సిటీది కీలక పాత్ర
పట్టణాభివృద్ధి పనులు పెద్దఎత్తున జరగాలి
ఈస్ట్-వెస్ట్ కనెక్టివిటీపై ప్రత్యేక దృష్టి
కాకినాడ, విశాఖలతో పశ్చిమ భారత
ప్రాంతాలను అనుసంధానించాలి: సీఎం చంద్రబాబు
అమరావతి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ (వీఈఆర్) సమగ్రాభివృద్ధికి చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీని పరిధిలోని అన్ని ప్రాంతాలను, అన్ని రంగాలను పరిగణనలోకి తీసుకుంటూ పూర్తిస్థాయి అభివృద్ధికి సూక్ష్మ ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ ప్రణాళికల్లో విద్యాసంస్థలను, విశ్వవిద్యాలయాలను కూడా కలుపుకొని ముందుకెళ్లాలని.. ఆంధ్ర యూనివర్సిటీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. విశాఖ రీజియన్ పరిధిలో కొత్త ప్రాజెక్టులు.. సీఆర్‌జడ్ రీ-క్లాసిఫికేషన్, వైజాగ్ బే సిటీ, బే-సిటీ అథారిటీ ఏర్పాటు తదితర అభివృద్ధి ప్రణాళికలపై బుధవారం ఆయన ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈస్ట్ టూ వెస్ట్ కనెక్టివిటీపై ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని.. ఇటీవల ప్రధాని మోదీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారని గుర్తుచేశారు. వీఈఆర్ పరిధిలో రూ.9.50 లక్షల కోట్ల పెట్టుబడులు రావడానికి అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రైవేటు రంగం నుంచి 5.3 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు చెప్పారు. అయితే రూ.3.50 నుంచి రూ.4 లక్షల కోట్ల వరకు ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం ఖర్చుచేయాల్సి వస్తుందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే గూగుల్ ఏఐ డేటా సెంటర్, ఆర్సెలార్ మిత్తల్-నిప్పన్ స్టీల్ ప్లాంట్ తదితర భారీ పరిశ్రమలు విశాఖ వచ్చాయని ప్రస్తావించారు. విశాఖలో ఐటీ, డేటా సెంటర్లు సహా వివిధ రంగాలకు చెందిన ఎకో సిస్టం ఏర్పాటైందని, దీనికనుగుణంగా వీఈఆర్ డెవల్‌పమెంట్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
వైజాగ్ బే సిటీది కీలక పాత్ర
వీఈఆర్ ప్రాజెక్టులో వైజాగ్ బే సిటీది కీలక పాత్ర అని ముఖ్యమంత్రి చెప్పారు. దీని ద్వారా పెద్దఎత్తున పట్టణాభివృద్ధి పనులు జరగాలని, ఇందుకోసం వివిధ పథకాల నిధులను కన్వెర్జన్స్ చేసి ఈ ప్రాజెక్టు కోసం వినియోగించాలని దిశానిర్దేశం చేశారు. కేంద్ర నిధులను మరింతగా రాబట్టడంపైనా దృష్టి సారించాలన్నారు. వీఈఆర్ పరిధిలో ఉన్న 6 అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీల్లో అద్భుతమైన అభివృద్ధి జరగాలని సీఎం సూచించారు. 'శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు మొదలుకుని రాజమహేంద్రవరంలోని అఖండ గోదావరి ప్రాజెక్టు వరకు ప్రతి టూరిజం స్పాట్‌తో సహా ప్రతి రంగాన్నీ అభివృద్ధి చేసేలా.. పెట్టుబడులు వచ్చేలా చేయడంతోపాటు అవసరమైన మేరకు ఎక్స్‌పీరియన్స్ జోన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. వివిధ ప్రాజెక్టులను అనుసంధానిస్తూ వీఈఆర్ ప్రగతి కొనసాగాలి. పెట్టుబడుల సాధన ద్వారా వివిధ రంగాల్లో ఉద్యోగాలను కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలి. స్థానిక యువతలో స్కిల్స్ పెంపొందించాలి. ఇందులో భాగంగా పీపీపీ ప్రాజెక్టులను అమల్లోకి తేవడంతోపాటు.. వాటికి వయబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) స్కీం అమలును పరిశీలించాలి. జరుగుతున్న అభివృద్ధి, చేపడుతున్న ప్రాజెక్టులు.. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు.. ఉద్యోగ-ఉపాధి అవకాశాలు వంటి అంశాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలి' అని సీఎం నిర్దేశించారు. బే సిటీ ప్రాజెక్టు అమలుకు ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. 'అన్ని ప్రాజెక్టులనూ అనుసంధానం చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. జీసీసీ, ఫిన్‌టెక్, లాజిస్టిక్స్ ఇంటిగ్రేషన్ రంగాలపై దృష్టి సారించాలి. రోడ్-రైల్ ఇంటిగ్రేషన్ జరగాలి. కాకినాడ, విశాఖతో పశ్చిమ భారతంలోని ప్రాంతాలు అనుసంధానం కావాలి. 4 ఎయిర్‌పోర్టులు, 3 పోర్టులను లింక్‌చేస్తే అభివృద్ధి వేగంతోపాటు పెట్టుబడులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. విశాఖలో జంతు ప్రదర్శనశాలను మరింత అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలి' అని సీఎం అన్నారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఆర్థిక, పరిశ్రమలు, పురపాలక, అటవీ, ఇంధన, పర్యాటక, విద్య, వైద్య శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చేసిన మంచిని ప్రతి ఇంటికీచెప్పండి
ఇంటింటికీ కార్యక్రమంపై చంద్రబాబు సమీక్ష
రాష్ట్రంలోని ప్రతిఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరించాలని సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. కూటమి 10 రోజుల్లో 26.98లక్షల ఇళ్లను సందర్శించడంపై హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఒక్కరోజే 3.35 లక్షల ఇళ్లను కూటమి శ్రేణులు సందర్శించాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఇదే ఉత్సాహంతో కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించాలన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అందించిన సంక్షేమ ఫలాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్ర పునర్నిర్మాణానికి తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని చంద్రబాబు ఆదేశించారు.

