తిరుపతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ఆదాయం కోసమే తిరుమల శ్రీవారి దర్శనాలు చేయిస్తున్నామన్న విమర్శల్లో వాస్తవం లేదని, భక్తుల అభీష్టం మేరకు కొవిడ్ నిబంధనలను అనుసరించి పరిమిత సంఖ్యలో దర్శనాలు కల్పిస్తున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. వాస్తవానికి కరోనా నేపథ్యంలో ఆదాయం కన్నా ఖర్చే ఎక్కువవుతోందని స్పష్టంచేశారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఆదివారం ఉదయం ఆయన 'డయల్ యువర్ ఈవో' కార్యక్రమంలో పాల్గొని భక్తుల సూచనలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కరోనా కేసుల పెరుగుదలతో కొద్ది రోజులుగా తిరుమలలో దర్శనాలు చేసుకునేవారి సంఖ్య తగ్గిందన్నారు. ఇప్పటివరకు 748మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, వీరిలో ఇప్పటికే 405మంది కోలుకున్నారని తెలిపారు.
అర్చకులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు
తిరుమల శ్రీవారి కల్యాణోత్సవాలను ఆపాలని అర్చకులు కోరలేదని, అర్చకులు ఎలాంటి సలహాలిచ్చినా స్పందిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న అర్చకులకు తిరుమలలో విధులు కేటాయించవద్దని ప్రధానార్చకులకు చెప్పామన్నారు. అర్చకులను ఇబ్బందికి గురిచేసి దర్శనాలు చేయించాలనే ఆలోచన టీటీడీకీ లేదని ఈవో స్పష్టం చేశారు.

