అమరావతి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): గత ఏడాది మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ సందర్భంగా కొంత మంది అధికారులను బదిలీ చేయాలని తామిచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తాజాగా దృష్టి సారించింది. ఎన్నికల ప్రక్రియ మొదలవడంతో సదరు అధికారులపై ప్రభుత్వం తప్పక చర్యలు తీసుకోవలసిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు వేసే సమయంలో జరిగిన హింసాత్మక సంఘటనలను తీవ్రంగా పరిగణించిన కమిషనర్ నిమ్మగడ్డ.. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు శామ్యూల్ ఆనంద్‌కుమార్, భరత్ గుప్తా.. ఎస్పీలు విజయారావు, సెంథిల్‌కుమార్‌లను వెంటనే తొలగించి, ప్రత్యామ్నాయ అధికారులను సూచించాలని ప్రభుత్వాన్ని కోరారు.
మిగతా వారికి సంబంధించి ఎలాంటి మార్పులు జరగలేదు. గురువారం హైకోర్టు తీర్పు దరిమిలా కమిషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల నిర్వహణపై మాట్లాడారు. చిత్తూరు, గుంటూరు కలెక్టర్లతో మాత్రం మాట్లాడలేదు. ఎస్‌ఈసీ ఆదేశించినా వారిని ప్రభుత్వం బదిలీ చేయకపోవడమే దీనికి కారణం. ఎన్నికల నిర్వహణపై వారితో మాట్లాడితే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించి.. ఆ జిల్లాల జేసీ-1లతో చర్చించినట్లు తెలిసింది. ఆయా అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మరోసారి కోరనున్నట్లు తెలిసింది.
