Monday, 13 Jul, 8.02 pm ఆంధ్రజ్యోతి

క్రీడాజ్యోతి
ఆ మ్యాచ్ గెలిచాక అమితాబ్‌లా ఫీల్ అయ్యా: కైఫ్

న్యూఢిల్లీ: 2002లో జరిగిన న్యాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌ విజయం సాధించడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని మహ్మద్ కైఫ్ తెలిపాడు. ఆ మ్యాచ్‌ జరిగి 18 ఏళ్లు గడిచినా తనకు ఇప్పటికీ అదో ప్రత్యేకమైన మ్యాచ్ అని వివరించారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో కైఫ్ మాట్లాడుతూ, పటిష్ఠమైన ఇంగ్లాండ్‌ను ఓడించి అలహాబాద్‌ తిరిగి వచ్చేటప్పటికి ఎక్కడ చూసినా సంబరాలే కనిపించాయని, అది చూసి తాను ఎంతగానో గర్వపడ్డానని తెలిపాడు. 'మఖ్యంగా ఆ మ్యాచ్ తర్వాత భారత క్రికెట్‌లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా చొక్కా విప్పి వేడుక చేసుకున్న గంగూలీ కెప్టెన్సీని అందరూ మెచ్చుకున్నారు. అంతేకాకుండా భారత్ కూడా భారీ స్కోర్లను ఛేజ్ చేయగలదన్న నమ్మకం అభిమానులకు కలిగించింది. ముఖ్యంగా 1983 తర్వాత లార్డ్స్ మైదానంలో భారత్ గెలిచిన రెండో మ్యాచ్ అదే కావడం విశేషం. దీంతో భారత కీర్తి ఎంతో పెరిగింది.

మ్యాచ్ అనంతరం నేను తిరిగివచ్చేసరికి మా ఊరు అలహాబాద్‌లో ఎక్కడ చూసినా వేడుకలే. నన్ను ఓపెన్ టాప్ జీప్‌లో ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లారు. దారి పొడవునా అభిమానులే. ఎటుచూసినా బారులు తీరి ఉన్నారు. ఒక్కసారిగా ఎంతో గొప్పగా అనిపించింది. ఆ క్షణంలో నాకు నేను బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌లా ఫీల్ అయ్యాను. అయితే సాధారణంగా నేను సిగ్గరిని. కానీ ఆ మ్యాచ్ తరువాత అందరూ నన్ను ఫాలో అవడం మొదలెట్టారు. నాకు ఊపిరాడనంతపనైంది. ఇంటికి వచ్చేవారికి, పోయేవారికి ఎడతెరిపి ఉండేది కాదు. అందరికీ టీ, కాఫీలు అందిస్తూ అమ్మ కూడా బిజీ అయిపోయేవారు. నాకు యమునా నది ఒడ్డున గాలిపటాలు ఎగురవేయడం ఎంతో ఇష్టం. ఆ మ్యాచ్ తరువాత నేను గాలిపటాలు ఎగురవేస్తున్నా నన్ను వింతగా చూసేవారు. నేను చాలా ఇబ్బంది పడేవాడిని. ఆ పరిస్థితులకు అలవాటు పడడానికి చాలా రోజులే పట్టింది' అంటూ కైఫ్ చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే మహ్మద్ కైఫ్ ఆడిన తీరు, జట్టుకు విజయాన్ని అందించిన వైనం ఇప్పటికీ అత్యద్భుతం. ఓటమి అంచులకు చేరుకున్న జట్టును యువరాజ్ సింగ్‌తో కలిసి విజయతీరాలకు చేర్చిన విధానం మరపురానిది. యువరాజ్, కైఫ్‌లు భారత జట్టులోకి అప్పుడే వచ్చారు. వారి పేర్లు కూడా చాలా మంది క్రికెట్ అభిమానులకు తెలియదు. అయితే ఆ మ్యాచ్‌లో సచిన్, సెహ్వాగ్ వంటి దిగ్గజాలందరూ పెవిలియన్‌కు చేరినా యువరాజ్‌తో కలిసి కైఫ్ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో అభిమానులకు కన్నుల పండువ చేశారు. ముఖ్యంగా మ్యాచ్ గెలిచిన తర్వాత గంగూలీ షర్ట్ విప్పి వేడుక చేసుకున్న తీరు ఇప్పటికీ అందరికీ కళ్లముందు మెదులుతూనే ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top