రాహుల్, గిల్ సెంచరీలు
భారత్ 368/3
అఫ్ఘాన్‌తో ఏకైక టెస్ట్
ముల్లన్‌పూర్: కేఎల్ రాహుల్ (100), శుభ్‌మన్ గిల్ (103 బ్యాటింగ్) సెంచరీలతో అదరగొట్టారు.
దీంతో అఫ్ఘానిస్థాన్‌తో శనివారం ఆరంభమైన ఏకైక టెస్టులో భారత్ భారీస్కోరు దిశగా సాగుతోంది. తొలిరోజు ఆట ముగిసే సరికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 368/3 స్కోరు చేసింది. గిల్‌కు తోడుగా రిషభ్ పంత్ (50 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (81) అర్ధ శతకం సాధించాడు. మహ్మద్ సలీం సఫీ 2 వికెట్లు దక్కించుకొన్నాడు.
బ్యాటర్ల జోరు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న భారత్.. అనుభవం లేని అఫ్ఘాన్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొన్నా.. అఫ్ఘాన్ రివ్యూ అడగకపోవడంతో బతికి పోయాడు. అయితే, ఓపెనర్ యశస్వి జైస్వాల్ (24)ను అవుట్ చేసిన సఫీ.. తొలి వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సుదర్శన్, రాహుల్ జాగ్రత్తగా ఆడడంతో.. లంచ్ వరకు భారత్ 96/1 స్కోరు చేసింది. ఆ తర్వాత రాహుల్ స్పిన్నర్లను లక్ష్యం చేసుకోగా.. సుదర్శన్ కూడా దూకుడు పెంచాడు. కానీ, జోరుమీదున్న సమయంలో సలీం బౌలింగ్‌లో సుదర్శన్ కీపర్‌కు క్యాచివ్వడంతో.. రెండో వికెట్‌కు 139 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత వచ్చిన కెప్టెన్ గిల్.. బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడంతో టీ సమయానికి భారత్ 209/2 స్కోరు చేసింది. ఇక, మూడో సెషన్‌లో 61వ ఓవర్‌లో షరీఫీ బౌలింగ్‌లో సెంచరీ పూర్తి చేసుకొన్న రాహుల్.. ఆ తర్వాతి బంతికి గుర్బాజ్‌కు క్యాచిచ్చాడు. మూడో వికెట్‌కు వీరిద్దరూ 67 రన్స్ జోడించాడు. ఈ సమయంలో గిల్‌కు జత కలసిన పంత్ ఆరంభంలోనే ఆచితూచి ఆడినా.. ఆ తర్వాత దూకుడు పెంచాడు. 70 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకొన్నాడు. మరోవైపు గిల్ కూడా కెరీర్‌లో 11వ శతకాన్ని అందుకొన్నాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు అభేద్యంగా 121 పరుగుల భాగస్వామ్యంతో భారత్‌ను బలమైన స్థితిలో నిలిపారు.
గిల్‌ను ఎందుకు తీసుకోలేదంటే..
యూకే పర్యటనకు ఎంపిక చేసిన టీ20 జట్టులో గిల్‌కు చోటు దక్కలేదు. ఐపీఎల్‌లో 732 రన్స్‌తో రాణించినా అతడిని సెలెక్టర్లు పక్కనబెట్టారు. ఎందుకంటే.. రాబోయే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్, వన్డే వరల్డ్‌కప్‌లపై అతడు పూర్తిస్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరముందని బోర్డు భావిస్తోంది. రాబోయే 18నెలల్లో జట్టు బిజీగా గడపనుంది. కెప్టెన్‌గా గిల్ 9డబ్ల్యూటీసీ టెస్టులు, వరల్డ్‌క్‌పనకు ముందు 35 వన్డేల్లో జట్టును నడిపించాల్సి ఉంది. ఈనేపథ్యంలో 3 ఫార్మాట్లలో ఆడే ప్లేయర్ తాజాగా ఉండడం సాధ్యం కాదని భావిస్తున్నారు.

