Dailyhunt
ఆర్టీఐ సంచలన నివేదిక.. శవాల దిబ్బగా హైదరాబాద్!

ఆర్టీఐ సంచలన నివేదిక.. శవాల దిబ్బగా హైదరాబాద్!

హైదరాబాద్: ''తెలంగాణలో కరోనా ఉధృతి లేనేలేదు. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చిచూస్తే తెలంగాణ మెరుగ్గా ఉంది. పాజిటివ్ రేట్ చాలా తక్కువ. మరణాల శాతంలో కూడా మనం చాలా బెటర్‌గా ఉన్నాం'' అని కొవిడ్ మరణాలపై సర్కార్ చెప్తోన్న ఇలాంటి మాటలు కల్లబొల్లి మాటలే అని తేలిపోయాయి. రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఓ స్వచ్చంద సంస్థ సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చింది. గడిచిన ఏడాది కాలంగా హైదరాబాద్ మహనగరంలో మున్సిపల్ శాఖ ద్వారా జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రాల సంఖ్యను చూస్తే నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఏడాది కాలంలో 32వేలమంది చనిపోయారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్ధం అవుతోంది.

ఏప్రిల్ 2020 నుంచి మే 2021 వరకు హైదరాబాద్‌లో 32,752 డెత్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు ఆర్టీఐ లెక్కలు చెప్తున్నాయి.


అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి

ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలో కొవిడ్ వేవ్ ప్రారంభమయ్యింది. దాదాపు మూడు నెలల పాటూ రాష్ట్రంలో పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఈ ఏడాది మే 31 వరకు అంటే రాష్ట్రంలో మొదటి వేవ్.. సెకండ్ వేవ్ తీవ్రంగా ప్రభావం చూపిన సమయం ఇది. ఈ ఏడాది కాలంలో ఒక్క హైదరాబాద్‌లోనే 32వేల మంది చనిపోయారంటే నగరం నిజంగా శవాల దిబ్బగా మారిందని స్వచ్ఛంద సంస్థ సభ్యులు అంటున్నారు. 2020 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య సంభవించిన మరణాల సంఖ్య 18,420 ఉండగా... ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు సంభవించిన మరణాల సంఖ్య 14,332. ఈ మరణాలన్నీ కొవిడ్‌ మరణాలనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

గడిచిన ఏడాది కాలంగా కొవిడ్‌తో చనిపోయిన వారి సంఖ్య కేవలం 3257 మాత్రమే ఉందని వైద్యారోగ్యశాఖ నివేదికలు చెప్తున్నాయి. కాని ఏడాది కాలంగా సర్కార్ జారీ చేసిన డెత్ సర్టిఫికెట్లు 32వేలకుపైగా ఉంటే మరి మిగతా మరణాలు ఎలా సంభవించాయి? మొత్తం డెత్ సర్టిఫికెట్లలో కేవలం 10శాతం మాత్రమే కొవిడ్ మరణాలు ఉంటే మిగతా 30వేల మంది ఎలా చనిపోయారు? ఏ వ్యాదితో చనిపోయారు? కోవిడ్ కంటే భయంకరమైన వ్యాది హైదరాబాద్‌లో ఏమైనా వచ్చిందా... వచ్చినా ఇంతమందిని పొట్టన పెట్టుకొనే మాయదారి రోగం ఎక్కడకు పోయింది? ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy