Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆస్ట్రేలియా చరిత్రలో మొదటిసారి.. లక్ష బొద్దింకల సీజ్..

ఆస్ట్రేలియా చరిత్రలో మొదటిసారి.. లక్ష బొద్దింకల సీజ్..

ఇంటర్‌నెట్ డెస్క్: ఆస్ట్రేలియా చరిత్రలోనే అతిపెద్ద అక్రమ విదేశీ కీటకాల రవాణా గుట్టురట్టయింది. అక్రమంగా బొద్దింకలు పెంచుతున్న స్థావరంపై వన్యప్రాణి సంరక్షణ అధికారులు దాడులు చేశారు.

మడగాస్కర్ హిస్సింగ్ జాతికి చెందిన లక్ష బొద్దింకలను సీజ్ చేశారు. వీటి విలువ 2,00,000 ఆస్ట్రేలియన్ డాలర్లు ( ఇండియన్ కరెన్సీలో 1.34 కోట్ల రూపాయలు) ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆస్ట్రేలియా డిపార్ట్‌మెంట్ ఆప్ క్లైమేట్ ఛేంజ్, ఎనర్జీ, ది ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (DCCEEW) తెలిపిన వివరాల మేరకు..

న్యూసౌత్ వేల్స్, బాథర్ట్స్‌లోని ఓ భవనంలో అక్రమంగా పెద్ద మొత్తంలో మడగాస్కర్ హిస్సింగ్ జాతికి చెందిన బొద్దింకలను పెంచుతున్నారని డీసీసీఈఈడబ్ల్యూ అధికారులకు సమాచారం అందింది. మే 26వ తేదీన ఆ భవనంపై డీసీసీఈఈడబ్ల్యూ, ఫెడరల్ ఎన్విరాన్‌మెంట్ డిపార్ట్‌మెంట్, వన్యప్రాణి అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. ఈ సందర్భంగా లక్ష విదేశీ బొద్దింకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆస్ట్రేలియాలో ఇంత పెద్ద మొత్తంలో అక్రమంగా పెంచుతున్న విదేశీ కీటకాలను స్వాధీనం చేసుకోవటం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు.

ఈ బొద్దింకల ప్రత్యేకత ఏంటంటే..

మడగాస్కర్ హిస్సింగ్ బొద్దింకలు ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన కీటకాల జాతికి చెందినవి. ఈ బొద్దింకలు సాధారణ బొద్దింకల కంటే పరిమాణంలో పెద్దగా ఉంటాయి. ఇవి సుమారు 3 అంగుళాల పొడవుతో, మనిషి అరచేతి పరిమాణంలో ఉంటాయి. వీటికి రెక్కలు ఉండవు కాబట్టి ఇవి ఎగరలేవు. ప్రమాదం ఎదురైనప్పుడు లేదా ఎవరైనా పట్టుకున్నప్పుడు.. పాములా 'హిస్‌స్‌స్' అనే వింత శబ్దాన్ని చేస్తాయి. మగ బొద్దింకల తలపై కొమ్ములు ఉంటాయి. వీటిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల పాములు, బల్లులు వంటి పెంపుడు సరీసృపాలకు ఆహారంగా పెడతారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటికి భారీ డిమాండ్ ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy