Monday, 14 Jun, 5.51 pm ఆంధ్రజ్యోతి

తెలంగాణ తాజావార్తలు
ఆయన అన్నారంటే జరగదు.. కేసీఆర్‌పై విజయశాంతి సెటైర్

ఇంటర్నెట్ డెస్క్: సీఎం కేసీఆర్‌ మాట అన్నారంటే అది జరిగే పనికాదని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి ఎద్దేవా చేశారు. వస్తున్నా వస్తున్నా అనడమే గానీ... ఓట్ల పండగప్పుడు తప్ప ఫాంహౌస్, ప్రగతి భవన్ వదిలి కేసీఆర్ రారని విమర్శించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి సమీక్ష సందర్భంగా అధికారులను సీఎం కేసీఆర్ హెచ్చరించిన నేపథ్యంలో విజయశాంతి ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం దర్శనం కావాలంటే ఓట్ల పండగ రావాలేమోనంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. తప్పదు అనుకుంటే ఏవో కొన్ని చోట్లకు వెళ్ళి ముఖం చూపించి తిరిగిరావడమే తప్ప, తన పనితీరుతో తెలంగాణను ఉద్ధరిస్తారంటే చిన్న పిల్లలు కూడా నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా సీఎం కేసీఆర్‌పై విజయశాంతి విమర్శల వర్షం కురిపించారు.

ఫేస్‌బుక్ పోస్ట్... యథాతథంగా..

తెలంగాణ సీఎం కేసీఆర్ గారు అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనుల్ని తానే స్వయంగా చెకింగ్ చేస్తానని, చెప్పకుండా... చెయ్యకుండా వచ్చి పరిశీలిస్తానని అన్నారు. ఆఫీసర్లు అందుబాటులో ఉండి తానడిగిన రిపోర్టులివ్వాలని... తేడా వస్తే స్పాట్‌లోనే సస్పెన్షన్లు ఉంటాయని సీరియస్‌గా హెచ్చరించారు. సీఎం మాటలకు భయపడాల్సిన పనిలేదని అధికారులకు బాగా తెలుసు. ఎందుకంటే, ఆయన ఒక మాట అన్నారంటే... అది జరిగే పని కాదని అందరికీ తెలుసు.

వస్తున్నా వస్తున్నా అనడమే గాని... ఓట్ల పండగప్పుడు తప్ప ఫాంహౌస్, ప్రగతి భవన్ వదిలి కేసీఆర్ రారని అందరికీ బాగా అర్థమైంది. సాగర్ ఎన్నికలప్పుడు 15 రోజుల్లో మళ్ళీ సాగర్ వచ్చి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు... నెలన్నర దాటినా అతి గతీ లేదు. అంతకు ముందు హుజుర్ నగర్ ఎన్నికలప్పుడు వచ్చి 15, 20 రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వరకు పర్యటించి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు... ఏడాదిన్నరైనా సారు అడ్రస్ లేడు. ఇక చాలా ఏళ్ళ కిందట వరంగల్ నగరం మురికివాడలకు వచ్చి... వారికి కొత్త ఇళ్ళు కట్టిస్తానని, దావత్ చేసుకోవడానికి 5 నెలల్లో మళ్లీ వస్తానని అన్నారు... ఏం జరిగిందో చెప్పక్కర్లేదు. ఇక ఈ తాజా చెకింగులు, వార్నింగుల అర్థమేంటో నేను చెప్పాల్సిన పనిలేదు. ఆయన దర్శనం కావాలంటే మళ్ళీ అక్కడ ఓట్ల పండగ రావాలేమో... కాదు, తప్పదు అనుకుంటే ఏవో కొన్ని చోట్లకు వెళ్ళి ముఖం చూపించి తిరిగిరావడమే తప్ప, ఈ సీఎం గారు తన పనితీరుతో తెలంగాణను ఉద్ధరిస్తారంటే చిన్న పిల్లలు కూడా నమ్మే పరిస్థితి లేదు. అయినా, వెళితే మంచిదే. ఎంతమంది ఉద్యోగాలు, 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్ళు, నిర్వాసితుల పరిహారం బాధితులు, ఇంకా... ధాన్యం కొనుగోళ్ళు కాక నష్టపడిన రైతులు సీఎం గారిని అడ్డుకుంటారో తెలుస్తుంది. కానీ, బాధాకరం ఏమిటంటే, ఇక వారిపై ఈ ముఖ్యమంత్రి గారి జులుం, కుక్కలు, చెప్పులు అంటూ శాపనార్థాలు... కవర్ చేసిన జర్నలిస్టులపై కేసులు, జైళ్ళు.... వంటి చిత్ర విచిత్ర తిక్క తుగ్లక్ విన్యాసాలన్నీ కూడా ఆవిష్కృతం చెయ్యవచ్చు. అలాగే ఈ సీఎం గారు సెక్రెటేరియట్ వెళ్ళి చూస్తే కూల్చివేత.... ప్రగతి భవన్‌కు పంపితే పక్క భవనాల కూల్చివేత... వరంగల్‌కు వెళితే జైలు కూల్చివేత.... ఇప్పుడు జిల్లాలలో ఏమేమి కూలుస్తాడో అని ప్రజలు భీతిల్లే పరిస్థితులు కూడా వినబడుతున్నాయ్.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top