హైదరాబాద్ సిటీ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా గత ఐదు నెలలుగా ఆదాయం లేక రోడ్డున పడిన తమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు, కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వినతిపత్రాన్ని కమిషనర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు బి.వెంకటేశం, సయ్యద్ నిజాముద్దీన్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఆటో, క్యాబ్, మోటార్ రంగ కార్మికులు జీవనోపాధి కోల్పోయి రోడ్డు పడ్డారని, చాలా మంది కుటుంబాలను పోషించుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్మికులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
ప్రధాన డిమాండ్లు
రోడ్డు, టోల్ ట్యాక్సులను రద్దు చేయాలి. ఓలా, ఉబర్ వసూలు చేస్తున్న 25 శాతం కమిషన్‌ను రద్దు చేయాలి. కరోనా సమయంలో ప్రతి రవాణా కార్మికునికి నెలకు రూ.7500లు ఇవ్వాలి. ప్రైవేటు ఫైనాన్సియర్ల దోపిడీ నుంచి కాపాడాలి. రుణ వాయిదాలను డిసెంబర్ వరకు వసూలు చేయవద్దని ఆదేశాలివ్వాలి. ఆటోలను, క్యాబ్‌లను సీజు చేసే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి జైలులో పెట్టాలి. మోటార్ వెహికిల్ (ఎంవీ) యాక్టును వెనక్కి తీసుకోవాలి.
