Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐపీఎల్ 2026: ఆర్సీబీ ఓపెనింగ్ జోడీపై కెప్టెన్ పాటీదార్ ఏమన్నాడంటే?

ఐపీఎల్ 2026: ఆర్సీబీ ఓపెనింగ్ జోడీపై కెప్టెన్ పాటీదార్ ఏమన్నాడంటే?

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 కీలక దశకు చేరుకుంది. నేటి నుంచి ప్లే ఆఫ్స్ సమరం ప్రారంభం కానుంది. ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి.

అయితే ఆర్సీబీ ఓపెనింగ్ కాంబినేషన్‌పై ఆసక్తికర చర్చ సాగుతోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి జోడీగా ఎవరు బరిలోకి దిగుతారన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై కెప్టెన్ రజత్ పాటీదార్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు.

గాయం కారణంగా లీగ్ స్టేజ్‌లో స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ చాలా మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌కి వెళ్లి చికిత్స తీసుకుని సాల్ట్ తిరిగి జట్టులో చేరాడు. అతడి గైర్హాజరీలో అవకాశాలు పొందిన బెథెల్.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. చివరి లీగ్ మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్‌ను ఓపెనర్‌గా దింపారు. ఆ మ్యాచ్‌లో అతడు.. అద్భుతమైన ఫామ్ కనబర్చి దూకుడుగా ఆడాడు. ఈ నేపథ్యంలో సాల్ట్ తుది జట్టులో ఉంటాడా? వెంకటేశ్ అయ్యర్‌నే ఓపెనర్‌గా బరిలోకి దింపుతారా? అనే ప్రశ్నలకు రజత్ సమాధానం ఇచ్చాడు. 'సాల్ట్ ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నాడు. ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. కానీ తుది జట్టులో ఉంటాడా? లేదా? అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు' అని పాటీదార్ వెల్లడించాడు.

చిన్న తప్పిదం చేసినా..

'పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటున్నాయి. బౌండరీలు చిన్నగా ఉన్నాయి. పైగా మంచు ప్రభావం కూడా ఉంటోంది. ఇవన్నీ బౌలర్లకు మరింత సవాల్‌ విసురుతాయని భావిస్తున్నా. ముఖ్యంగా పేసర్లు ఏ చిన్న పొరపాటు చేసినా ఆ బంతి సిక్సర్‌గా మారిపోతుంది. అయితే, మాకు ఎలాంటి పిచ్‌ ఇచ్చినా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నిస్తాం' అని రజత్ అన్నాడు. గుజరాత్‌తో క్వాలిఫయర్ గురించి మాట్లాడుతూ.. సీజన్‌ మొదలైనప్పటి నుంచి ఆర్సీబీ, గుజరాత్ బాగా ఆడాయని పేర్కొన్నాడు. అయితే, మ్యాచ్‌ జరిగే రోజు ఏ జట్టయితే తమ ప్రణాళికలను అమలు చేసి.. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటుందో అదే విజయం సాధిస్తుందన్నాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy